48గంట‌ల‌పాటు ఇంట్లోనే క‌రోనా మృత‌దేహం!

దేశ‌వ్యాప్తంగా క‌రోనావైర‌స్ విజృంభ‌ణ‌‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. మాస్కు, భౌతిక దూరం పాటిస్తున్నా వైర‌స్ ఏ రూపంలో సంక్ర‌మిస్తుందోన‌నే భ‌యం ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. ఇక‌ క‌రోనా సోకిన వారు మ‌ర‌ణిస్తే వారి మృత‌దేహాన్ని ..

Published : 04 Jul 2020 01:44 IST

కుటుంబస‌భ్యులు వేడుకున్నా స్పందించ‌ని అధికారులు

ఇంట్లో మృత‌దేహంతో రెండురోజులు న‌ర‌క‌యాత‌న‌

కోల్‌క‌తా: దేశ‌వ్యాప్తంగా క‌రోనావైర‌స్ విజృంభ‌ణ‌‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. మాస్కు, భౌతిక దూరం పాటిస్తున్నా వైర‌స్ ఏ రూపంలో సంక్ర‌మిస్తుందోన‌నే భ‌యం ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. ఇక‌ క‌రోనా సోకిన వారు మ‌ర‌ణిస్తే వారి మృత‌దేహాన్ని ఇంటికి కూడా తీసుకువెళ్లేందుకు నిబంధ‌న‌లు అనుమ‌తించవు. అలాంటిది, అధికారుల నిర్లక్ష్యవైఖరితో ఏకంగా క‌రోనా సోకిన వ్యక్తి మృత‌దేహాన్ని రెండురోజులపాటు ఇంట్లోనే భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన విషాధ ‌ఘ‌ట‌న‌ కోల్‌క‌తాలోని ఓ కుటుంబానికి ఎదుర‌య్యింది. సాయం చేయాల‌ని కుటుంబస‌భ్యులు వేడుకున్న‌ప్ప‌టికీ కోల్‌క‌తా అధికారులు స్పందించిన‌ తీరు విస్మ‌యానికి గురిచేస్తోంది.

క‌రోనా సోకి మ‌ర‌ణించిన వారి విష‌యంలో ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన‌ప్ప‌టికీ అధికారులు మాత్రం కొన్నిచోట్ల నిర్ల‌క్ష్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. సెంట్ర‌ల్‌ కోల్‌క‌తాలో రాజా రామ్మోహన్‌రాయ్‌ కాల‌నీకి చెందిన ఓ 71ఏళ్ల వృద్ధుడు అనారోగ్యానికి గుర‌య్యాడు. జ్వ‌రంతోపాటు కొవిడ్ ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో కుటుంబస‌భ్యులు ఓ వైద్యుడి స‌ల‌హాతో ప్రైవేటు ల్యాబ్‌లో ప‌రీక్ష చేయించారు. అనంత‌రం వృద్ధుడిని ఇంటికి తీసుకురాగా ఆరోగ్యప‌రిస్థితి విష‌మించి సోమ‌వారం మధ్యాహ్నం క‌న్నుమూశాడు. అయితే, కొవిడ్ ప‌రీక్షా ఫ‌లితం ఇంకా రాక‌పోవ‌డంతో అత‌డికి మ‌ర‌ణ ధృవీక‌ర‌ణప‌త్రాన్ని ఇచ్చేందుకు స్థానిక ఆసుప‌త్రి వైద్యులు నిరాక‌రించారు.

ఇదే విష‌యాన్ని అత‌ని కుటుంబసభ్యులు స్థానిక పోలీసులు, కౌన్సిల‌ర్ల‌కు తెలియ‌జేసి వారి సాయం కోరారు. వారు ఎలాంటి స‌హాయం చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ‌ వైద్యాధికారుల‌తోపాటు మున్సిపల్‌ అధికారుల దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లారు. అంత్య‌క్రియ‌ల కోసం ఏర్పాట్లు చేయాల‌ని కుటుంబస‌భ్యులు వేడుకున్న‌ప్ప‌టికీ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాకుండా మృత‌దేహాన్ని ఇంటిలోనే ఉంచాల‌ని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబ‌స‌భ్యులు రాష్ట్ర కొవిడ్ హెల్ప్‌లైన్ సాయం కోరేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అక్క‌డ ‌కూడా చుక్కెదురైంది. ఇక అంత్య‌క్రియ‌ల ‌కోసం న‌గ‌రంలోని ప‌లు శ్మ‌‌శాన‌వాటికలను సంప్ర‌దించ‌గా మ‌ర‌ణ ధృవీక‌ర‌ణప‌త్రం లేద‌ని ఖ‌న‌నం చేసేందుకు నిరాకరించారు. క‌నీసం మ‌ర‌ణ ధృవీక‌ర‌ణప‌త్రాన్ని జారీచేయాల‌ని మునిసిప‌ల్ అధికారులకు విన్న‌వించుకున్న‌ప్పటికీ వారినుంచి ఎటువంటి స్పంద‌న రాలేదు. ఇలా వంద‌ల సార్లు అధికారుల‌కు ఫోన్లు చేయ‌డంతోపాటు వారిచుట్టూ తిరిగినా ఫ‌లితం లేద‌ని కుటుంబస‌భ్యులు తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. దీంతో చేసేదేంలేక బ‌య‌ట మార్కెట్‌లో ఓ ఫ్రీజ‌ర్‌ను కొనితెచ్చి ఇంటిలోనే రెండురోజుల పాటు మృత‌దేహాన్ని ఉంచారు. 

ఇలా వ్య‌క్తి మ‌ర‌ణించిన 48గంట‌ల అనంత‌రం వైద్య‌ప‌రీక్ష‌ల్లో ఆ వృద్ధుడికి పాజిటివ్ అని తేలిన విష‌యాన్ని అధికారులు కుటుంబస‌భ్యులకు తెలిపారు. ఈ విష‌యం మీడియాలో రావ‌డంతో మేల్కొన్న అధికారులు బుధ‌వారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించడం గ‌మ‌నార్హం. అయితే, కుటుంబస‌భ్యులు ఎంత వేడుకున్నా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన కోల్‌క‌తా అధికారుల తీరుపై అపార్టుమెంటువాసులు, స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని