Kamareddy: అమ్మా..ఎందుకిలా చేశావమ్మా!

ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులు. బాబుకు నాలుగేళ్లు. పాపకు ఆరునెలలు. అమ్మ తోడుంటే చాలు వారికి ఇంకేమీ అక్కర్లేదు.

Updated : 27 Dec 2022 10:12 IST

ఇద్దరు పిల్లలను వాగులో విసిరేసి చంపిన తల్లి

బాన్సువాడ శివారులో విషాదం

బాన్సువాడ, బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులు. బాబుకు నాలుగేళ్లు. పాపకు ఆరునెలలు. అమ్మ తోడుంటే చాలు వారికి ఇంకేమీ అక్కర్లేదు. అంతకు మించి అర్థం చేసుకోలేని పసితనం. అటువంటి ఇద్దరు పిల్లలను కన్నతల్లే వాగులోకి విసిరేసింది. గమనించిన స్థానికులు వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శివారులో సోమవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌ జిల్లా నాగారం సమీపంలోని చక్రనగర్‌తండాకు చెందిన అరుణ, మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన మోహన్‌ భార్యాభర్తలు. వారికి కుమారుడు యువరాజు, కుమార్తె అనోన్య ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పుట్టింటికి వచ్చిన అరుణకు భర్త ఫోన్‌ చేసి ఉద్గీర్‌ వచ్చేయాలని చెప్పారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె తల్లి గారి గ్రామం నుంచి బయలుదేరింది. దారిలో బాన్సువాడ శివారులోని వాగులో ఇద్దరు చిన్నారులను పడేసింది. చూసిన స్థానికులు వెంటనే వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డిలు ఆసుపత్రికి వెళ్లి ఆరాతీశారు. నిజామాబాద్‌ నుంచి ఆటోలో వస్తుండగా డ్రైవర్‌ తనపై అఘాయిత్యం చేయడంతో పిల్లలను వాగులో పడేసి పారిపోయానని అరుణ వారికి తెలిపింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా.. వాగు వద్ద ఆటో కానీ, డ్రైవర్‌ కానీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని