విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ సంస్థల్లో ఈడీ సోదాలు

క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వర్గాలు శుక్రవారం సోదాలు నిర్వహించాయి.

Updated : 25 Mar 2023 06:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వర్గాలు శుక్రవారం సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్‌లో 3, బెంగళూరులో 4 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌తో పాటు మరో రెండుచోట్ల ఆ సంస్థ కార్యాలయాలు, నిర్వాహకుల ఇళ్లలో తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్నారనే అభియోగాలతో ఆ సంస్థపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆ సంస్థ మోసాలపై తెలంగాణ పోలీసులు దాదాపు 38 కేసులు నమోదుచేశారు. వీటి ఆధారంగానే ఈడీ 2020లో ఈసీఐఆర్‌ నమోదు చేసి మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టింది. 2013 నుంచే ముంబయి, బెంగళూరు, చెన్నై, దిల్లీ తదితర నగరాల్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు చట్టవ్యతిరేకంగా ఉన్నాయంటూ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌లో నమోదైన కేసుల్లో పలువురు సినీ, వ్యాపార ప్రముఖులకు నోటీసులు జారీచేశారు. మాజీ బిలియర్డ్స్‌ ఆటగాడు మైఖేల్‌ ఫెరీరా, బాలీవుడ్‌ నటులు షారూఖ్‌ఖాన్‌, అనిల్‌కపూర్‌, బొమన్‌ ఇరానీ, వివేక్‌ ఒబెరాయ్‌, జాకీషరాఫ్‌, పూజాహెగ్డే, క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ తదితర 500 మందికి నోటీసులు పంపించారు. ఈ ప్రముఖులంతా క్యూనెట్‌ తరఫున బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించినందుకు ఈ నోటీసులు పంపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయా కేసుల్లో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇటీవలే సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం పాలవ్వడంతో మరోసారి గొలుసుకట్టు దందా బహిర్గతమైంది. ఈనేపథ్యంలోనే తాజా సోదాలకు ప్రాధాన్యం సంతరించుకొంది.


బుచ్చిబాబును సుదీర్ఘంగా విచారించిన ఈడీ

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును ఈడీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. దిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న బుచ్చిబాబు రాత్రి 8.00 గంటల తర్వాత బయటకు వచ్చారు. దిల్లీ మద్యం కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై ఆయనను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 8న బుచ్చిబాబును సీబీఐ అధికారులు ఇదే కేసులో అరెస్టు చేసిన విషయం విదితమే. ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగానే ఈ నెల ఆరో తేదీన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. నాటి నుంచి పలుమార్లు ఈడీ అధికారులు బుచ్చిబాబును విచారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని