Crime News: హైదరాబాద్‌ -విజయవాడ హైవే సమీపంలో నగ్నంగా జంట మృతదేహాలు

యాదాద్రి జిల్లా కొత్తగూడెం వద్ద రెండు గుర్తు తెలియని మృతదేహాలు కలకలం సృష్టించాయి.

Updated : 03 May 2022 19:38 IST


అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలోని కంపచెట్ల మధ్య గుర్తు పట్టలేని స్థితిలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఇవి కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ జంట మృతదేహాలపై దర్యాప్తు చేపట్టాయి. మృతదేహాల సమీపంలో వారికి సంబంధించిన బ్యాగ్‌ లభ్యమైంది. అక్కడ లభ్యమైన వివరాల ఆధారంగా మృతులు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారాసిగూడకు చెందిన ఎడ్ల యశ్వంత్‌(22), జ్యోతి(28)గా పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం యశ్వంత్‌ ఇంటి నుంచి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. యశ్వంత్‌ అదృశ్యంపై చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు అతని సోదరుడు అనిరుధ్‌ వెల్లడించారు. జ్యోతి ఎవరో తమకు తెలియదని, ఎవరూ శత్రువులు కూడా లేరని పోలీసులకు వివరించాడు. గతంలో కాలనీలో చిన్న చిన్న గొడవలు జరిగాయని, అవి హత్యకు కారణం కాకపోవచ్చని పేర్కొన్నాడు.

ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ పరిశీలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే హత్యగా భావిస్తున్నాం. జ్యోతికి వివాహమైంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితులు యశ్వంత్‌ మర్మాంగంపై దాడి చేసి ఛిద్రం చేశారు. జ్యోతి ముఖంపైనా రాయితో మోది హతమార్చారు. ఎవరు హత్య చేశారనేది దర్యాప్తు చేస్తున్నాం’’ అని డీసీపీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని