logo

అధికారినని.. అందినకాడికి దండుకోవాలని..!

మున్సిపల్‌ పరిధిలో పన్నుల చెల్లింపు పాత్ర ఎంతో కీలకం. వాటిని సకాలంలో చెల్లిస్తేనే పనులు సక్రమంగా సాగుతాయి.

Updated : 16 Apr 2024 06:01 IST

మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట వ్యాపారులకు ఫోన్‌కాల్స్‌

నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయం

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: మున్సిపల్‌ పరిధిలో పన్నుల చెల్లింపు పాత్ర ఎంతో కీలకం. వాటిని సకాలంలో చెల్లిస్తేనే పనులు సక్రమంగా సాగుతాయి. అభివృద్ధి జరుగుతుంది. అందుకే.. నీటి, ఆస్తి, వ్యాపార అనుమతి తదితర అంశాలకు సంబంధించిన పన్నులు లక్ష్యానికి అనుగుణంగా వసూలయ్యేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తుంటారు. ఈ అవకాశాన్ని కొందరు తమకు అనుకూలంగా మలచుకొని అక్రమమార్గంలో, సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఈ విషయం స్థానికంగా ఆందోళనకు కారణమైంది. విషయతీవ్రతను గుర్తించిన అధికారులు చివరకు పోలీసులను ఆశ్రయించారు.

ఏం జరిగిందంటే..

పట్టణంలోని పాతబస్టాండ్‌లో చికెన్‌ సెంటర్‌ నిర్వహించే వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. అందులోని సారాంశం పరిశీలిస్తే.. ‘హలో.. నేను, రాజు, నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను మాట్లాడుతున్నా. పాతబస్టాండ్‌లో ఉన్న చికెన్‌ సెంటర్‌ మీదేనా? మీ దుకాణం ట్రేడ్‌ లైసెన్సు ఎందుకు రెన్యువల్‌ చేయలేదు. సమయంలో చెల్లించాలి కదా. మీ వాట్సప్‌ నంబరు నుంచి నాకు హాయ్‌ అని మెసేజ్‌ చేయండి. నేను స్కానర్‌ కోడ్‌ పంపిస్తాను. మీ లైసెన్స్‌ రెన్యువల్‌ డబ్బులు ఆ స్కానర్‌కు ఫోన్‌పే చేయండి. ఇకమీదట ఏటా సమయంలోపు చెల్లించండి. మళ్లీ నా దృష్టికి రావొద్దు..’ అని ఫోన్‌ పెట్టేశారు. దీంతో సదరు వ్యాపారి అయోమయానికి గురయ్యారు. డబ్బులు కట్టాలా వద్దా అనే మీమాంసలో పడిపోయారు. ఇది కేవలం ఒక్కనికే కాదు, పలువురికి ఇదేరీతిలో ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అందరిలోనూ సందిగ్ధమే. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఈసారి ఫోన్‌చేసి మరీ డబ్బులు కట్టాలని సూచిస్తున్నారు. ఎందుకిలా? వార్షిక లక్ష్యాల సాధనకు ఇలా చేస్తున్నారేమోనని భావించారు. కట్టేద్దాంలే అనుకున్నారు. అయితే.. డబ్బులు ఎవరైనా స్కానర్‌ కోడ్‌ ఆధారంగా చెల్లించారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

వ్యాపారుల్లో ఆందోళన..

సాధారణంగా మున్సిపల్‌ సిబ్బంది వచ్చి పెండింగ్‌ పన్నులు వసూలు చేయడం చూస్తూనే ఉంటాం. పెద్దమొత్తంలో ఉంటే నోటీసులు జారీచేయడమూ తెలిసిందే. కానీ, ఏకంగా ఓ మున్సిపల్‌ కమిషనర్‌ తీరిక చేసుకొని ప్రతీ వ్యాపారికి ఫోన్‌చేసి పన్నులు చెల్లించాలని చెప్పడం వాస్తవానికి సాధ్యమయ్యే పనికాదు. ఇతర పని ఒత్తిళ్లతో తీరికలేకుండా ఉండే అధికారి ఇలా ట్రేడ్‌ లైసెన్సుల కోసం ప్రతీ నంబరుకు కాల్‌చేయడం కుదరదు. ఓ అధికారే నేరుగా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో డబ్బులు చెల్లిస్తారని, వారు చెప్పిన నంబరుకు పంపిస్తారన్న ఆశతో ఈ ప్రయత్నం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట వచ్చిన కాల్స్‌ వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారడమే వారిని ఆందోళనకూ గురిచేశాయి.

ఆన్‌లైన్‌లో తీసుకొని..!

అంతర్జాల వినియోగంపై అవగాహన ఉన్నవారో, మున్సిపల్‌ సిబ్బంది సాయంతోనో ఈ తతంగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ వెబ్‌సైట్‌లో మనకు కావాల్సిన మున్సిపాల్టీని ఎంపికచేసుకొని అక్కడ అందుబాటులో ఉండే పౌరసేవలు, పన్నుల చెల్లింపు ఐచ్ఛికాలను ఆధారంగా చేసుకొని ఇలా వసూళ్లకు యత్నించారు. ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలు, అందులోని చరవాణి నంబరు ఆధారంగా వారికి కాల్‌చేసి డబ్బులు చెల్లించాలని నమ్మబలికారు. ఇందుకోసం ట్రూకాలర్‌ సాయంతో వారి నంబరును మున్సిపల్‌ కమిషనర్‌ అని కనిపించేలా జాగ్రత్తపడినట్లు అవగతమవుతోంది. దుకాణం, పెండింగ్‌ వివరాలను తెలియజేస్తూ డబ్బులు అడగడం, జరిమానా తగ్గించేందుకు వారు సూచించిన నంబరుకు ఫోన్‌పే చేయాలని అడగడం.. ఇదంతా చూస్తుంటే ఎంతో పకడ్బందీగా, కట్టుదిట్టంగా వ్యవహరించారనే విషయం సుస్పష్టమవుతోంది.

పోలీసులకు ఫిర్యాదుచేశాం: సి.వి.ఎన్‌.రాజు, మున్సిపల్‌ కమిషనర్‌, నిర్మల్‌

మున్సిపల్‌ కమిషనర్‌ పేరిట నకిలీ వ్యక్తులు కాల్‌చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరో తప్పుడు నంబర్ల సాయంతో ఈ పనిచేశారు. ప్రజలెవరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. ఎలాంటి పన్నులు చెల్లించాలన్నా నేరుగా ఆన్‌లైన్‌లో లేదా మున్సిపల్‌ కార్యాలయంలో, గుర్తింపు ఉన్న మున్సిపల్‌ సిబ్బంది వద్ద మాత్రమే చెల్లించాలి. తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఫేక్‌ కాల్స్‌ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదుచేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని