logo

అరకొర పరిహారం.. అన్నదాతల ఆక్రోశం

తమ పొలాల నుంచి జాతీయ రహదారి వెళ్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది భూములకు మంచి విలువ ఉంటుందని ఆశ పడిన అన్నదాతలకు నిరాశే మిగులుతోంది.

Published : 17 Apr 2024 06:31 IST

గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారికి భూములిచ్చేది లేదంటున్న వైనం

 జైపూర్‌ మండలం నర్వ శివారులో ప్రతిపాదిత మంచిర్యాల-వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణ ప్రదేశం

జైపూర్‌, న్యూస్‌టుడే: తమ పొలాల నుంచి జాతీయ రహదారి వెళ్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది భూములకు మంచి విలువ ఉంటుందని ఆశ పడిన అన్నదాతలకు నిరాశే మిగులుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలుకుతున్న భూములకు ప్రభుత్వం నామమాత్రంగా గ్రామాన్ని బట్టి రూ.4 నుంచి రూ.8 లక్షల పరిహారం ఇస్తామంటూ నోటీసులు పంపిస్తున్నారు. దీంతో మంచిర్యాల-వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్వాసిత రైతులు లబోదిబోమంటున్నారు.

 నాగ్‌పూర్‌-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. అందులో జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారం శివారులోని నర్వా నుంచి పౌనూర్‌ గ్రామంలోని గోపాల్‌పూర్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. 14 గ్రామాల మీదుగా 23.097 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. పచ్చని పొలాలు, గ్రామాలను ఆనుకుని నిర్మాణం సాగే ఈ జాతీయ రహదారిలో సుమారు 110 హెక్టార్ల మేర భూములు రోడ్డు నిర్మాణంలో కనుమరుగు కానున్నాయి.

అప్పట్లో రూ.8 లక్షలు

గోదావరి నది మీద సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం చేపట్టిన 2015-16 సంవత్సరంలో దాని సమీప గ్రామాల్లో ఎకరానికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అలాంటి ప్రాజెక్టు కోసం భూములు తీసుకుని సుమారు 7-8 ఏళ్లు అవుతుంటే అప్పటికంటే సగమే ఇప్పుడు పరిహారం ఇవ్వడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం ఇస్తేనే భూములిచ్చి సహకరిస్తామని అప్పట్లో శెట్‌పల్లి గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బాధిత రైతులు తేల్చి చెప్పారు. అయితే గ్రామాన్ని బట్టి పరిహారం రూ.4-8 లక్షల పరిహారం కేటాయిస్తూ పలువురు రైతులకు నోటీసులు అందాయి. దీన్ని నిరసిస్తూ ఇటీవల స్థానిక తహసీల్దార్‌కు సైతం పరిహారం పెంచాలని వారు వినతిపత్రం అందజేశారు.


ఈ పరిహారంతో మరోచోట దొరుకుతుందా..
తుమ్మనపెల్లి నర్సింగారావు, కుందారం

గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణంలో నాకు సంబంధించి 2 ఎకరాల 13 గుంటల భూమిని నష్టపోతున్నా. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మా గ్రామంలో ఎకరం రూ.40-80 లక్షలు పలుకుతుంది. వీళ్లేమో ఎకరానికి రూ.4.30 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని నోటీసులు పంపిస్తున్నారు. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సమయంలో ఎకరానికి రూ.8 లక్షలపైచిలుకు పరిహారం ఇచ్చారు. వీరిచ్చే నామమాత్రపు పరిహారంతో మరో చోట భూమి దొరుకుతుందా.


మార్కెట్‌ ధర ఇస్తేనే ..
బోయిని రాజయ్య, నర్సింగాపూర్‌

సుందిళ్ల ప్రాజెక్టు ఏర్పాటుతో మా ప్రాంతంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మా గ్రామంలో భూముల ధరలు ఎకరానికి రూ.50 లక్షలపైచిలుకు పలుకుతుంది. అలాంటి భూములకు రూ.4 లక్షల పరిహారం ఇస్తామని మా పక్క గ్రామాల రైతులకు నోటీసులు ఇచ్చారు. రోడ్డు నిర్మాణంలో 30 గుంటల నా భూమి పోతుంది. రెండేళ్ల కిందటే గుంటకు రూ.3.50 లక్షల ఇస్తామంటే ఇవ్వలేదు. మార్కెట్‌ రేటు ఇస్తేనే భూమి ఇస్తాం. లేకుంటే ఇచ్చేది లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని