logo

మళ్లీ.. ఏనుగు గండం!

గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది.

Published : 23 Apr 2024 02:39 IST

జిల్లాకు ఎప్పుడైనా వచ్చే అవకాశం..

పెంచికల్‌పేట్ మండల అడవుల్లో ఏనుగు సంచారం

ఈనాడు, ఆసిఫాబాద్‌: గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. తదనంతరం మహారాష్ట్రకు వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల, కుమురం భీం జిల్లా ప్రాణహిత నదీ తీరం వెంబడి గ్రామాల వైపు ఏనుగు మళ్లీ వచ్చే అవకాశం ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఏనుగు వచ్చినా ప్రాణనష్టం జరగకుండా, అదే సమయంలో దానికి ఎలాంటి హాని కలగకుండా.. ఉమ్మడి జిల్లా అటవీశాఖాధికారులు, పాలనాధికారులు, ఎస్పీలు మంగళవారం మంచిర్యాలలో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నెల 2, 3 తేదీల్లో పెంచికల్‌పేట్ మండలం కొండపల్లికి చెందిన పోషన్న, చింతలమానేపల్లి మండలానికి శంకర్‌ అనే రైతులను ఏనుగు తొక్కి హతమార్చింది. గంటల వ్యవధిలోనే జరిగిన ఈ దారుణంతో మేల్కొన్న అటవీ అధికారులు.. దాదాపు వందమందిని నియమించి ఏనుగు కదలికలను తెలుసుకున్నారు. రహదారులపై పలుమార్లు ఏనుగు కనిపించినా ఎవరిపై దాడి చేయలేదు. 5వ తేదీ మధ్యాహ్నం మొర్లిగూడ గ్రామ సమీపంలో రహదారిపై వెళ్తున్న ఆటో సమీపంలో రాగా భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. మరుసటి రోజు సాయంత్రం ఏనుగు ప్రాణహిత సరిహద్దు దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిందని అటవీ అధికారులు నిర్ధారించారు.

ఒంటరిగానే..

ఒడిశా రాష్ట్రం నుంచి తెచ్చి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నాలుగు సంవత్సరాల కిందట 50-60 ఏనుగులను వదిలారు. ఈ గుంపు నుంచి తప్పిపోయిన ఏనుగే కుమురం భీం జిల్లా వచ్చింది. భారీ ఆకారంతో యుక్తవయసులో ఉన్న ఈ ఏనుగు ఉన్న కొన్ని గంటల పాటు ప్రజలను భయకంపితులను చేసింది. ఇది ప్రస్తుతం మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఒంటరిగానే సంచరిస్తోందని, అక్కడ మాత్రం పదిహేను రోజులుగా ఎవరిపై దాడి చేయలేదని అధికారులు చెబుతున్నారు.

50-60 కిలోమీటర్ల దూరంలో..

ప్రాణహిత నదిని ఆనుకుని మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ అభయారణ్యాలు ఒకవైపు ఉండగా, మరోవైపు తెలంగాణకు చెందిన కుమురం భీం, మంచిర్యాల జిల్లాల గ్రామాలు ఉంటాయి. ప్రస్తుతం ఏనుగు నదికి కేవలం 50-60 కిలోమీటర్ల మేర సంచరిస్తోందని, ఏ క్షణమైనా మళ్లీ తెలంగాణ వైపు రావొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా లేదా గుంపుగా వచ్చినా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.

పరిహారం కోసం ఎదురుచూపులు..

18 రోజుల కిందట గజరాజు దాడిలో గంటల వ్యవధిలో ఇద్దరు రైతులు చనిపోయారు. కొండపల్లికి చెందిన పోశన్న(56), బూరేపల్లికి చెందిన శంకర్‌(50) కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే రైతులు వీరు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారంతోపాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర అధికారులు ప్రకటించారు. నేటికీ పరిహారం రాకపోవడంతో వీరంతా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పరిహారం వెంటనే మంజూరు చేయడంతోపాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.

నిపుణులను రప్పిస్తాం

ఏనుగు కదలికలు, ప్రవర్తన, తీసుకునే జాగ్రత్తల గురించి నిపుణులను రప్పిస్తాం. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఏనుగు ఎప్పుడైనా రావొచ్చు. అందుకు అనుగుణంగా మహారాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాని కదలికలను తెలుసుకుంటున్నాం. కుమురం భీం, మంచిర్యాల జిల్లాలకు వచ్చినా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలతో పాటు, అధికారులను సూచనలు చేస్తాం.

శాంతారాం, సీసీఎఫ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని