logo

ఆదిలాబాద్‌ లోక్‌సభ బరిలో..

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంగా ఏర్పడింది.

Updated : 23 Apr 2024 06:30 IST

మొదటిసారి మహిళ

ఆత్రం సుగుణ, కాంగ్రెస్‌ అభ్యర్థి

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంగా ఏర్పడింది. 2009లో ఎస్టీలకు రిజర్వు చేశారు. ఎస్టీలకు రిజర్వు చేసిన తర్వాత ప్రథమంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాఠోడ్‌ రమేష్‌ పోటీ చేసి గిరిజనుడిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2014 ఎన్నికలలో భారాస తరఫున గోడం నగేష్‌ విజయకేతనం ఎగురవేశారు. 2019లో భాజపా తరఫున ఎంపీ సోయం బాపురావు విజయం సాధించారు. మొట్టమొదటి సారి ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తున్నారు.

రాష్ట్రం నుంచి రెండో ఆదివాసీ అతివగా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్టీకి రిజర్వు స్థానంగా ఉన్న భద్రాచలం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1967లో రాధాబాయి ఆనంద్‌రావు పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా రాధాబాయి ఆనంద్‌రావు 1967, 1971, 1977, 1980లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి రెండో ఆదివాసీ మహిళగా ఆత్రం సుగుణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


కాంగ్రెస్‌ అభ్యర్థి వెంట ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క రాక

నాలుగో రోజు మూడు నామపత్రాలు దాఖలు

ఆర్వోకు నామపత్రం అందజేస్తున్న ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్‌ అభ్యర్థి సుగుణ, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీహరిరావు

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ రెండోసెట్ నామపత్రాన్ని స్వయంగా వచ్చి రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషాకు సోమవారం అందజేశారు. ఆమెతో కలిసి ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆదిలాబాద్‌ కలెక్టరేట్కు వచ్చారు. ఇది వరకే వెడ్మబొజ్జు కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున తొలి నామపత్రం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజున ఆదిలాబాద్‌ పట్టణం రణదివెనగర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి మెస్రం గంగాదేవి నామపత్రాన్ని ఆర్వోకు అందజేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి రాఠోడ్‌ సుభాష్‌ తమ రెండో సెట్ నామపత్రాలను సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని