logo

మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు

జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది.

Published : 25 Apr 2024 06:22 IST

కరుగుతున్న గుట్టలు

దిలావర్‌పూర్‌ మండలం కాల్వ తండా సమీపంలోని తవ్విన గుట్ట ప్రాంతం

నిర్మల్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. అనుమతులు లేకుండా అక్రమంగా జరిపిన తవ్వకాలతో పర్యావరణానికి హాని కలగడంతోపాటు ప్రభుత్వం రూ. లక్షల్లో ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. అక్రమ మార్గంలో ఇష్టమొచ్చిన చోట తవ్వకాలు చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, స్థలాలు, వాగులు, చెరువులు, కుంటలు ఇలా దేన్ని వదలట్లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం మెక్కేస్తూ.. వెంచర్లలో నింపేస్తున్నా సంబంధితశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఎలా తరలిపోతుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు..

దిలావర్‌పూర్‌ మండలం కాల్వ తండా సమీపంలోని గుట్ట ప్రాంతం నుంచి ఆరు నెలలుగా మొరం తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల మొరం తరలిపోతోంది. ఒక్కో ట్రాక్టర్‌లో సుమారు 2.85 క్యూబిక్‌ మీటర్ల మొరం తీసుకెళ్లొచ్చు. ఒక్కో క్యూబిక్‌ మీటరు మట్టికి రాయల్టీ కింద ప్రభుత్వానికి రూ.30 చెల్లించాలి. రోజుకు సగటున వంద ట్రాక్టర్లలో 285 క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలిపోతుంది. ఈ లెక్కన రోజుకు రూ.8,550 ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇలానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకే చోట నుంచి ప్రభుత్వం ఇంత ఆదాయం కోల్పోతే జిల్లా వ్యాప్తంగా ఎన్ని కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  

అనుమతులేవీ..?

భూమి చదునుకు మొరం తరలించాలంటే గనులశాఖ నుంచి అనుమతులు పొందాలి. పట్టాభూముల్లో మొరం తరలించాలంటే హెక్టారుకు రూ.40 వేల చొప్పున గనులశాఖ వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. క్యూబిక్‌ మీటరుకు రూ.30 చెల్లించాలి. వీటితోపాటు 2 శాతం ఆదాయం పన్ను, ఒక శాతం కార్మిక పన్ను కట్టాల్సి ఉంటుంది. కానీ నిర్మల్‌ శివారు ప్రాంతాల్లో, పల్లెల్లో మొరం తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా.. సంబంధితశాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వకాలు అసలే చేయరాదు. కానీ నిర్మల్‌ చుట్టూ ప్రాంతాల్లో యథేచ్ఛగా చేస్తున్నారు. గుట్టలను కరిగించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు. నిర్మల్‌లోని ఆదర్శనగర్‌, విశ్వనాథ్‌పేట్‌, గాజుల్‌పేట్‌, సిద్ధాపూర్‌, శాంతినగర్‌, వెంకటాపూర్‌లతో పాటు మండలంలోని కడ్తాల్‌, శాకెర, వెంగ్వాపేట్‌, కొండాపూర్‌, వెంకటాపూర్‌, అక్కాపూర్‌, తదితర గ్రామాల్లో వెలిసిన లేఅవుట్లలో అక్రమంగా మొరం తరలించి చదును చేశారు. అనుమతి లేని ఈ లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నిర్మల్‌ సమీపంలో లేఅవుట్‌లో పోసిన మొరం కుప్పలు


ఎక్కడెక్కడి నుంచి తరలిపోతుందంటే..

  • ఒక్కో వెంచర్‌లో వందలాది టిప్పర్‌ ట్రిప్పుల మొరం వేస్తున్నారు. లేఅవుట్లు నల్లరేగడి భూముల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు స్తిరాస్థి వ్యాపారులు రోడ్ల నిర్మాణం, స్థలాల ఎత్తు పెంచేందుకు మొరంతో నింపుతున్నారు.
  • ప్రభుత్వ సెలవు, ఆదివారాల్లో అధికారులు ఉండరని భావించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్దమొత్తంలో మొరం తీసుకెళ్తున్నారు.
  • జిల్లా కేంద్రం సమీపంలోని వైఎస్సార్‌నగర్‌, విశ్వనాథ్‌పేట్‌, బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ప్రాంతాల్లోని గుట్టలను కరగగొట్టి నిత్యం వందలాది టిప్పర్లలో అక్రమంగా మొరం తరలిస్తున్నారు.
  • సారంగాపూర్‌ మండలం చించోలి(బి), గోపాల్‌పేట్‌ శివారు నుంచి నిర్మల్‌ పట్టణానికి మట్టి తరలిస్తున్నారు. అక్కడక్కడ అడపాదడపా పోలీసులు అక్రమ తరలింపును అడ్డుకొని సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నారు.  
  • దిలావర్‌పూర్‌ మండలం కాల్వ, కాల్వ తండా సమీపంలో ఉన్న గుట్టను తొలిచేస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లలో మొరం తరలిస్తున్నారు.
  • లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌, సోన్‌ మండలం బొప్పారం గ్రామాల సమీపంలో గుట్టను తవ్వేస్తున్నారు.
  • భైంసా పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న గుట్ట నుంచి మొరం తీసుకెళ్తున్నారు.
  • ముథోల్‌ మండలం మచ్కల్‌, భైంసా మండలం ఇలేగాం ప్రాంతాల్లోని గుట్టల నుంచి మట్టిని తీస్తే మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
  • తానూరు మండలం భోసి, బేల్‌తరోడ శివారులోని బాలాజీగుట్ట, బోంద్రట్‌, తదితర ప్రాంతాల్లోని గుట్టల నుంచి మొరం తరలింపు జరుగుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని