logo

చూద్దాం.. చేద్దాం..!

పాడేరు ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశం శనివారం సాదాసీదాగా జరిగింది. కొత్త జిల్లాలో నిర్వహించిన తొలి సమావేశం కావడంతో కీలక సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌నాథ్‌, ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర,

Published : 03 Jul 2022 02:29 IST

అధికారుల తీరిది.. అమాత్యుల జాడేది!
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంపై అసంతృప్తి


వేదికపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, పీవో

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: పాడేరు ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశం శనివారం సాదాసీదాగా జరిగింది. కొత్త జిల్లాలో నిర్వహించిన తొలి సమావేశం కావడంతో కీలక సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌నాథ్‌, ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు ఈ సమావేశానికి తప్పకుండా వస్తారని ప్రచారం సాగింది. చివరికి వారంతా వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అధ్యక్షతన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ పర్యవేక్షణలో సమావేశం నిర్వహించారు. సభలో ప్రతిపక్ష సభ్యులు కూడా లేకపోవడంతో మొక్కుబడిగా సాగింది. గతంలో చేసిన తీర్మానాలపైనా చర్చించారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణలతో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, జీసీసీ ఛైర్‌పర్సన్‌ స్వాతిరాణి పలు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. చిన్నచిన్న సమస్యలకు సైతం అధికారులు, ఎమ్మెల్యేల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సభ్యులు కొంత అసహనానికి గురయ్యారు. ప్రతి అంశానికి చూద్దాం..చేద్దాం.. ప్రతిపాదనలు పంపామనే సమాధానాలే ఉన్నతాధికారుల నుంచి రావడంతో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

* ఎంపీ గొట్టేటి మాధవి మాట్లాడుతూ కొయ్యూరు మండలం వెలగలపాలెం, కొత్తపాలెం తాగునీటి పథకాలకు మరమ్మతులు చేయాలన్నారు. ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించాలన్నారు.  

* ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు అందించడంపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొయ్యూరు మండలం మఠంభీమవరం పరిధిలోని పలకజీడిలో గ్రామంలో మినీ పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని కోరారు. కాఫీ రైతులకు గత ఏడాదికి సంబంధించిన బకాయిలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.

* ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు లేరని, వీరి భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. డుంబ్రిగుడ మండలం నిర్మాణంలో ఉన్న వంతెనలు పూర్తి చేయాలన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లే ముందు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలన్నారు.

* జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ కు.ని. శస్త్రచికిత్సలకు గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళలను విశాఖ తరలించడంపై సమాధానం చెప్పాలని పట్టుపట్టారు.

* ట్రైకార్‌ ఛైర్మన్‌ సతక బుల్లిబాబు మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో నియమించాలన్నారు.

* జడ్పీటీసీ సభ్యులు వారం నూకరాజు, బొంజుబాబు, గాయత్రిదేవి, మత్స్యలింగం, ఎంపీపీలు నాగరత్నం, బాబూరావు ఆయా మండలాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 

సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు

ప్రతి ఇంటికి కుళాయి

* జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పరిధిలో రూ.230 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ సహకరించాలన్నారు.

* ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ మాట్లాడుతూ 72 సౌర విద్యుత్తు పథకాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత ఐటీడీఏ బైలాలో అల్లూరి సీతారామరాజుగా మార్పు చేస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.  సబ్‌ కలెక్టర్‌  అభిషేక్‌, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా,  డివిజన్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని