logo

వర్షాలతో మునిగిన రైతన్న

అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది.

Published : 21 Mar 2023 01:20 IST

ఆరబోసిన పసుపు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది. దీనికితోడు పసుపు సాగు చేసిన పొలాల్లోకి నీరు చేరి, మొక్కలొచ్చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు పసుపు ఉడికించి కల్లాల్లో ఆరబోసి ఉంచారు. ఇదంతా తడిసిపోయింది. మాకవరం, కరిముఖిపుట్టు, పెదగుడ, కిలగాడ, జర్రెల, జర్జుల, బంగారుమెట్ట ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలిచింది. అసలే ఈ ఏడాది మార్కెట్‌లో పసుపు ధర పతనమైంది. గతేడాది కేజీ రూ. 90 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది గరిష్ఠంగా రూ. 58కి మించి చెల్లించడం లేదు. ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు నిండా ముంచాయని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

పంట కాపాడుకునేందుకు పాట్లు

ఎటపాక, న్యూస్‌టుడే: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే వర్షం కురవడం, ఆగిపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. సోమవారం ఉదయం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండటంతో గత రెండు రోజులుగా టార్పాలిన్‌ కింద భద్రపరిచిన మిరప కాయలను ఆరబోసుకున్నారు. ఇంతలోనే మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో వాటిని మరోసారి కుప్పలు చేసుకుని టార్పాలిన్‌ కప్పేలోపు మిరప కాయలు తడిశాయి. గుండాలకాలనీ, కన్నాయిగూడెం, ఎటపాక, రాజుపేట, మేడువాయి, పిచ్చుకలపాడు, గన్నవరం, మురుమూరు, నందిగామ, సీతాపురం, తోటపల్లి, కృష్ణవరం గ్రామాల్లో కల్లాల్లోని మిరపకాయలు వర్షానికి తడిశాయి.

దేవీపట్నం, న్యూస్‌టుడే: వర్షాలు తగ్గుముఖం పట్టకపోడంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పొత్తులు తడిచిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పూడిపల్లి, ఎ.వీరవరం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులకు కొన్ని చోట్ల మొక్కజొన్న చేలు నేలవాలాయని రైతులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని