logo

అసత్యాల సారథి.. ఏదీ వారధి?

ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

Updated : 10 May 2024 04:47 IST

ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

ఆ ఒడ్డు, ఈ ఒడ్డు.. నడిమధ్య ఏరు అడ్డు..
దాటేందుకు వంతెనల్లేక చుట్టూ తిరిగి రావడం..
నీళ్లలో దిగి బిక్కుబిక్కుమంటూ దాటడం..
ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి రావడం..
దీనిని మంచి చేయడం అనాలా.. నట్టేట్లో ముంచడం అనాలా జగన్‌?


వర్షాలొస్తే వణుకే!
బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే

బీఎన్‌ రహదారిలో విజయరామరాజుపేట దగ్గర కూలిన వంతెన

మార్గం : భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్‌) రహదారి
ప్రాంతం : బుచ్చెయ్యపేట మండలం వడ్డాది-చోడవరం మధ్యలో విజయరామరాజుపేట దగ్గర తాచేరుపై వంతెన గతేడాది డిసెంబరు 20న కూలిపోయింది.
పరిస్థితి : పాడేరు, మాడుగుల, వడ్డాది నుంచి వాహనాలు చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం వైపు వెళ్లాలంటే ఇక్కడ వంతెన మీదగానే ప్రయాణించాలి. ఇది కాస్తా కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అంతా పూర్తిగా స్తంభించింది. ప్రయాణికులందరూ నానాకష్టాలు పడ్డారు.
పాలకులు చేసిందేంటి : కూలిపోయిన వంతెన స్థానంలో మళ్లింపు రోడ్డు నిర్మించారు. తాచేరులో గొట్టాలు పరిచి పైన మట్టి వేసి వదిలేశారు. వర్షాకాలం వస్తే ఈ రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించే ప్రమాదం ఉంది. కొత్తవంతెన నిర్మాణం దిశగా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.


ప్రతిపాదనలతో సరి!
బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే

మార్గం : భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్‌) రహదారి
వంతెన : బుచ్చెయ్యపేట మండలం వడ్డాది దగ్గర
పెద్దేరుపై.. 2022 మే నెలలో కూలిపోయింది.
పరిస్థితి : అనకాపల్లి జిల్లా, మన్యాన్ని కలిపే మార్గంలో వంతెన ఇది. నిర్వహణ, మరమ్మతులు లేకపోవడం, ఇసుక తవ్వకాలు, అధిక బరువుతో కూడిన గ్రానైటు లారీలు తిరగడంతో కూలిపోయింది. సుమారు నెలరోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
పాలకులు చేసిందేంటి : పక్కన రూ. కోటి వ్యయంతో కాజ్‌వే నిర్మాణం చేపట్టారు. దీన్ని తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల తరచూ ముంపు బారిన పడుతోంది. పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి అధికారులు రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించినా ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించలేదు. భారీ వర్షాలు పడితే రాకపోకలు నిలిచిపోతాయి.


చేతకాక చేతులెత్తేశారు
కోటవురట్ల, న్యూస్‌టుడే

జల్లూరు వద్ద అసంపూర్తిగా..

మార్గం : కోటవురట్ల మండలం నర్సీపట్నం-అడ్డురోడ్డు
ప్రాంతం : జల్లూరు వద్ద
వరాహా నదిపై పరిస్థితి : బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉండటంతో, తెదేపా హయాంలో రూ. 6 కోట్లు మంజూరు చేసి, సుమారు 90 శాతం పనులను పూర్తిచేశారు. ఇంకా కేవలం రెండువైపులా అప్రోచ్‌ పనులే మిగిలాయి.
పాలకులు చేసిందేంటి : అయిదేళ్ల కాలంలో వైకాపా పాలకులు 10 శాతం పనులు చేయలేక చతికిలపడ్డారు. మరోసారి అధికారంలోకి వస్తే పనులు పూర్తి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు.


నెరవేరని నేతల హామీ
కొయ్యూరు, న్యూస్‌టుడే

మార్గం : కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ వీరవరం-గొట్టెలపాడు
వంతెన : గొట్టెలపాడు సమీపంలోని బూడిదగెడ్డ
పరిస్థితి : యు.చీడిపాలెం, ఉల్లిగుంట, ఎర్రగొండ, మర్రిపాకలు తదితర గ్రామాలకు ఇదే మార్గం. వర్షాలు పడితే బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.
పాలకులు చేసిందేంటి : బూడిదగెడ్డతోపాటు ఈదులబంద, పలకజీడి సమీపంలో వంతెనల నిర్మాణానికి మూడున్నరేేళ్ల కిందట ఆయా గ్రామాల గిరిజనులకు వంతెన నిర్మిస్తామని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హామీ ఇచ్చారు. ఈదులబంద, బూడిదగెడ్డ దగ్గర వంతెన నిర్మాణాలకు ఒక్కోదానికి సుమారు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. కనీసం ఒక్క అడుగూ ముందుకు పడలేదు.


అసంపూర్తి వంతెనతో అవస్థలు

మార్గం : చిలకలగెడ్డ-జీలుగులపాడు
ప్రాంతం : జీలుగులపాడు వద్ద గోస్తనీ నదిపై..
పరిస్థితి : అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సుమారు 30 గ్రామాల ప్రజల రాకపోకలకు ప్రస్తుతం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. స్థానికులే చందాలు వేసుకుని మట్టి వేసుకుని ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు కాస్త ఏర్పాటు చేసుకున్నారు. అత్యవసర సమయాల్లో కనీసం 108 వాహనం రాలేని పరిస్థితి ఉంది.

అనంతగిరి, న్యూస్‌టుడే

పాలకులు చేసిందేంటి? : వంతెన నిర్మాణం కోసం సుమారు రూ. 2 కోట్ల నిధులను ప్రభుత్వం  మంజూరు చేసినట్లుగా ప్రకటించింది. పనులు ప్రారంభించిన గుత్తేదారు ఆరు శ్లాబ్‌లు వేయాల్సి ఉంది. ఐదు శ్లాబ్‌లు వేశాక నిధులు చాలలేదని పనులు మధ్యలో ఆపేశారు.


కుంబిడిసింగి వెళ్లాలంటే కష్టాలే!

శ్రమదానంతో రాళ్ల వారధి నిర్మించుకుంటున్న గిరిజనులు

మార్గం : జి.మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్‌ నుంచి కుంబిడిసింగి  
ప్రాంతం : కుంబిడిసింగిలోని మత్స్యగెడ్డ
పరిస్థితి : భారీ వర్షాలు వచ్చినప్పుడు జనజీవనం స్తంభించి పోతుంది. అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంచాయతీ ప్రజలే ఏకమై తాత్కాలికంగా రాళ్లను పేర్చి దానిపై కంకర వేసి రాకపోకలు సాగిస్తున్నారు.
పాలకులు చేసిందేంటి? : పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ పంచాయతీలో పర్యటించి గెడ్డను పరిశీలించారు. బ్రిడ్జిని నిర్మిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇచ్చిన హామీ అమలు కాలేదు.

జి.మాడుగుల, న్యూస్‌టుడే


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని