logo

గోదావరిలో పడి విద్యార్థి మృతి

ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. మండలంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి తీరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 10 May 2024 01:56 IST

పాయం జితేంద్రబాబు (పాత చిత్రం)

ఎటపాక, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. మండలంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి తీరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పండువారిగూడెంలో నివాసం ఉంటున్న గొమ్ముకొత్తగూడెం ఎంపీటీసీ సభ్యురాలు  పాయం దేవి కుమారుడు జితేంద్ర బాబు (15) తన స్నేహితులైన కౌలూరి సాంబశివ, పండా వెంకయ్యలతో కలిసి తప్పిపోయిన గేదెలు వెతికేందుకు గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్లాడు. నెల్లిపాక లిఫ్టిరిగేషన్‌ సమీపంలో గోదావరిలో సేద తీరుతున్న గేదెలను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఇద్దరు స్నేహితులు నీటిలోకి దిగారు. ఒడ్డుమీద ఉన్న జితేంద్ర కూడా వాటిని తోలుకొద్దామని నీటిలోకి దిగాడు. అతడు దిగిన చోట లోతు ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయాడు. స్నేహితులు చరవాణి ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు వచ్చి గాలింపు చేపట్టగా మునిగిన చోటే దొరికాడు. అప్పటికే మృతిచెందాడు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తెదేపాకు చెందిన దేవి కుమారుడు జితేంద్ర మృతి చెందిన విషయం తెలుసుకున్న మండల తెదేపా నాయకులు మువ్వా శ్రీనివాస్‌, పాటి చలపతిరావు, వల్లభనేని చందు, కిలారు వెంకటేశ్వరరావు, నలజాల శ్రీకాంత్‌, గోడేటి రవికుమార్‌, బాచినేని శ్రీకాంత్‌, దొండమూడి రాంబాబు తదితరులు మృతదేహాన్ని సందర్శించి  నివాళులర్పించారు. ఎంపీటీసీ సభ్యురాలి కుటుంబాన్ని ఓదార్చి తమ సానుభూతి తెలిపారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని