logo

జీవో నంబర్‌ 3 పునరుద్ధరణకు కృషి

గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్‌ 3 పునరుద్ధరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్‌ నరసింహరావు అన్నారు.

Published : 10 May 2024 02:11 IST

మాట్లాడుతున్న రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్‌ నరసింహరావు,
చిత్రంలో కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, దొన్నుదొర తదితరులు

అరకులోయ, న్యూస్‌టుడే: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నంబర్‌ 3 పునరుద్ధరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. అరకులోయ అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు గురువారం ఆయన అరకులోయ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత యువతకు గుండెకాయలాంటి జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రివ్యూ పిటిషన్‌ వేయాల్సిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ జీవో రద్దుకు సీపీఎం సహకరించి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ప్రజల ఆశలను వైకాపా ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు దారి మళ్లించిందని చెప్పారు. జిల్లాల విభజన అనంతరం అరకును జోన్‌ 2లో చేర్చారని పేర్కొన్నారు. దీని కారణంగా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరకు జోన్‌ని మార్పు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మన్యం అభివృద్ధికి, ఆదివాసీల సంక్షేమానికి ప్రధాని మోదీ అనేక పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతలను గెలిపించాలని కోరారు. అరకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నాయకులు దొన్నుదొర, దాసుబాబు, శెట్టి బాబూరావు, భాజపా నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని