logo

భారీగా గంజాయి పట్టివేత

విశాఖ నుంచి చెన్నైకు 140 కిలోల గంజాయిని అక్రమంగా కారులో తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. 

Published : 21 Mar 2023 01:20 IST

బాపట్ల, న్యూస్‌టుడే: విశాఖ నుంచి చెన్నైకు 140 కిలోల గంజాయిని అక్రమంగా కారులో తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.  రంపచోడవరానికి చెందిన వేమలపూడి గవాస్కర్‌ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నాడు. గతంలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు రెండుసార్లు పట్టుబడ్డాడు. బెయిల్‌ పై వచ్చిన అతడు గంజాయి వ్యాపారం చేస్తున్న రంపచోడవరానికే చెందిన బుజ్జితో చేతులు కలిపాడు. కారు బాడుగకు తీసుకుని గంజాయిని చెన్నైకి చేర్చితే రూ.1.20 లక్షలు చెల్లిస్తానని బుజ్జితో ఒప్పందం చేసుకున్నాడు. రాజవొమ్మంగి మండలం శరభవరం గ్రామానికి చెందిన లగిజే ఈశ్వరప్రసాద్‌ ద్వారా కారు తీసుకుని కొయ్యూరు మండలం కర్రి దారబాబుతో కలిసి 140 కిలోల గంజాయిని విశాఖ స్టీల్‌ప్లాంటు సమీపంలో ఈ నెల 18న తీసుకుని చెన్నై బయలుదేరారు. 19న మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద సీఐ ఫిరోజ్‌, ఎస్సై కమలాకర్‌ వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు కారును వెనక్కి తిప్పి పారిపోవటానికి ప్రయత్నించారు. సీఐ, ఎస్సైలు పోలీసు సిబ్బందితో కలిసి పట్టుకుని కారులో అక్రమంగా తరలిస్తున్న 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  గవాస్కర్‌, ఈశ్వరప్రసాద్‌, దారబాబును అరెస్టు చేశారు. మరో నిందితుడు బుజ్జిని అరెస్టు చేయాల్సి ఉంది.

గోకవరం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాలపై 22 కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కొత్తపల్లి పెదపాత్రుని చెరువు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన పడాల కన్నబాబు, రంపచోడవరం మండలం చినబీరంపల్లికి చెందిన మలగల బాలరాజు, అడ్డతీగల మండలం భీముడుపాకలకు చెందిన కొనుతూరి కృష్ణ, గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన తడాల నాగరవితేజలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు