logo

స్థావరం మార్చారు!

మత్తు పదార్థాల్లో గంజాయి అత్యంత ప్రమాదకరమైనది. ఇటీవల ఎక్కువ మంది యువత దీనికి బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. నిన్నా, మొన్నటి వరకు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగించిన గంజాయి

Published : 10 Aug 2022 05:58 IST

యథేచ్ఛగా గంజాయి విక్రయాలు


విమానాశ్రయ ప్రహరీకి  ఆనుకొని రాత్రిపూట గంజాయి బ్యాచ్‌ కార్యకలాపాలు  సాగిస్తున్న ప్రదేశం ఇదే

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాల్లో గంజాయి అత్యంత ప్రమాదకరమైనది. ఇటీవల ఎక్కువ మంది యువత దీనికి బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. నిన్నా, మొన్నటి వరకు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగించిన గంజాయి బ్యాచ్‌, మందు బాబులు తాజాగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాలు అడ్డాగా చేసుకుని ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.

నూతన ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో అటు అజ్జంపూడి, కేసరపల్లి, బుద్ధవరం.. హైవేకి ఆనుకొని ఉన్న విమానాశ్రయ పరిసరాల్లో నిత్యం మాటు వేస్తూ యథేచ్ఛగా గంజాయిని నగరానికి చేరవేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఏడు గంటలు దాటిందంటే చాలు.. స్థానిక కాలనీల్లో నడవాలంటేనే ఇబ్బందిగా ఉందని స్థానిక మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై యువత ఆయా గ్రామాలకు ఇరువైపులా చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారని వాపోతున్నారు. స్థానికంగా ఉన్న కాలనీల్లోని యువత పూర్తిగా మత్తుకు బానిస కావడంతో తల్లిదండ్రులు వేదన అంతా ఇంతా కాదని చెబుతున్నారు. ప్రజా రవాణా, అద్దె కార్లలో గంజాయిని నగరానికి తరలిస్తుండగా ఖాకీలకు చిక్కక తప్పడం లేదని.. ఇటీవల ఎంచుకున్న లింక్‌ మార్గాలను కూడా పోలీసులు బయటపెట్టడంతో ఎటువంటి అనుమానం రాకుండా విమానాశ్రయ పరిసరాలను వ్యాపార కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు.

* కొరవడిన పర్యవేక్షణ: ధ్రవ, ఘన, చెరసా ఇలా సుమారు నాలుగు నుంచి ఐదు రకాలుగా తరలించే గంజాయికి నిర్మానుష్య ప్రాంతాలైన కేసరపల్లి, గన్నవరం శివార్లలో నిత్యం ఏదోమూలన పట్టుబడుతూనే ఉన్నారు. యువకుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ.. ప్రత్యేక పర్యవేక్షణ కొరవడంతో ఈ ముఠా ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని నివాసితులు జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద ఖాకీలను చూసి పరారైన, ప్రమాదాలకు గురై వదిలివెళ్లిన ప్రతి వాహనంలో గంజాయి పట్టుబడిన దాఖలాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన విమానాశ్రయం పరిసరాల్లో ప్రత్యేక నిఘాతో పరిస్థితిని చక్కదిద్దాలని సామాజిక వేత్తలు, ప్రజలు కోరుతున్నారు.

భయాందోళనలో ఉద్యోగినులు

గన్నవరం పరిసర ప్రాంతాల్లోని విమానాశ్రయం, మేధ టవర్స్‌, హెచ్‌సీఎల్‌ ఇతర ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే యువతీ యువకులు విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న ఓ ప్రైవేట్‌ వసతి గృహంలో నివసిస్తున్నారు. సుమారు ముప్పై మందికి పైగా ఉద్యోగినులు సదరు గృహంలో నివసిస్తుండగా.. రాత్రివేళ రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. పరిసరాలు మరింత భయానకంగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. నెలకు రూ.పది వేలు మేర ఖర్చుచేసి ఉంటున్నా కనీస రక్షణ కొరవడిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని