logo

23న పెడనకు సీఎం జగన్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23న పెడనకు వస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. ఆ రోజు ఉదయం గం.10.30కు సీఎం ఇక్కడ ‘నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

Published : 17 Aug 2022 04:56 IST

సభాస్థలిని పరిశీలించిన ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల


పెడన తోటమూల సెంటర్‌ సమీపంలో చర్చిస్తున్న సీఎం ప్రోగ్రాం కన్వీనర్‌ రఘురాం. పక్కన మంత్రి రమేష్‌, కలెక్టర్‌ తదితరులు

పెడన, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23న పెడనకు వస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. ఆ రోజు ఉదయం గం.10.30కు సీఎం ఇక్కడ ‘నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తోటమూల జంక్షన్‌కు సమీపంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ జాషువాలతో కలిసి మంత్రి మంగళవారం సమీక్షించారు.

సభాస్థలి పరిశీలన

పెడన - బంటుమిల్లి రహదారిపై స్థానిక తోటమూల జంక్షన్‌కు సమీపంలో ఖాళీగా ఉన్న పదెకరాల స్థలాన్ని సీఎం బహిరంగ సభ కోసం అధికారులు ప్రాథమికంగా ఎంపికచేశారు. హెలిప్యాడ్‌ను గూడూరు రోడ్డులోని నాగయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఈ రెండింటినీ ప్రోగ్రాం కన్వీనర్‌ రఘురాం ప్రాథమికంగా పరిశీలించారు. అయితే సభస్థలికి ఆయన అంగీకారం తెలిపినా హెలిప్యాడ్‌ అక్కడికి దూరం అవుతుందని, మరో చోటకు మార్చాలని అధికారులకు సూచించారు. దీంతో హెలిప్యాడ్‌ ఎంపిక వాయిదాపడింది. అయితే బైపాస్‌ రోడ్డు లేదా సభాస్థలికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటుచేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

అధికారులతో సమీక్ష

అనంతరం మంత్రి, కలెక్టర్‌, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఎమ్మెల్సీ రఘురాంలు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమావేశపు హాల్లో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. ప్రజారోగ్య విభాగాన్ని అప్రమత్తం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, పెడన మున్సిపల్‌ కమిషనర్‌లను కలెక్టర్‌ ఆదేశించారు. ఈనెల 23 వరకు జిల్లా అధికారులు పెడనలోనే ఉండాలని మంత్రి జోగి రమేష్‌ ఆదేశించారు. పెడనకు 30 కి.మీ.ల దూరం నుంచి ప్రజలను సభాస్థలికి తీసుకురావాలని తలశిల రఘురాం సూచించారు. పెడన నియోజకవర్గంతో పాటు గుడ్లవల్లేరు, మచిలీపట్నంల నుంచి ప్రజలను పెడనకు తీసుకురావాలని చెప్పారు. ఒక్క పెడనలోనే 3161 మంది నేతన్న నేస్తం లబ్ధిదారులున్నారని, వీరిని చైతన్యపర్చి సభకు తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్ని సూచించారు. అలాగే పెడన కలంకారీ హస్తకళకు ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక జ్ఞాపికను అందజేయాలని  సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కిషోర్‌, పద్మావతి, విజయకుమార్‌, డ్వామా పీడీ సూర్యనారాయణ, చేనేత జౌళిశాఖ ఏడీ రఘునంద, డీఎంహెచ్‌వో డా.గీతాబాయి, మత్య్సశాఖ జేడీ ఎ.శ్రీనివాసరావు, ముడా వీసీ నారాయణరెడ్డి, స్థానిక తహసీల్దార్‌ పి.మధుసూదనరావు, మున్సిపల్‌ ఛైర్‌పర్శన్‌ బీజీఎల్‌ జ్యోత్స్నారాణి, కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని