logo

కదలికే లేదు..!

పోర్టు నిర్మాణం కలగానే మిగులుతోంది. నెలల వ్యవధిలోనే నిర్మిస్తామని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు చేయడం తప్పితే క్షేత్రస్థాయిలో ఒక్క అడుగుకూడా ముందుకు కదలడం లేదు. కొద్దిరోజులు టెండర్ల ప్రక్రియ చేపట్టామన్నారు. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ రివైజ్డ్‌ డీపీఆర్‌ తయారు చేయించారు.

Published : 28 Sep 2022 05:19 IST

నెలల వ్యవధిలోనే నిర్మిస్తారంట
పోర్టు నిర్మాణంపై ప్రకటనలతో కాలయాపన
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

పోర్టు నిర్మాణం కలగానే మిగులుతోంది. నెలల వ్యవధిలోనే నిర్మిస్తామని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు చేయడం తప్పితే క్షేత్రస్థాయిలో ఒక్క అడుగుకూడా ముందుకు కదలడం లేదు. కొద్దిరోజులు టెండర్ల ప్రక్రియ చేపట్టామన్నారు. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ రివైజ్డ్‌ డీపీఆర్‌ తయారు చేయించారు. తరువాత టెండర్ల ప్రక్రియను ఎట్టకేలకు ముగించారు. మొదటినుంచీ ఉన్న ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం చేపడతామని చెప్పి మళ్లీ నిర్ణయాన్ని మార్చుకుని పారిశ్రామిక అవసరాలకు భూములు గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా విడత విడతకూ విధానాలు మార్చుతూ కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది.

పోర్టుకు అనుబంధంగా రోడ్డు, రైలుమార్గానికి మండల పరిధిలోని పోతేపల్లి, కరగ్రహారం, అరిశేపల్లి, మేకవానిపాలెం, మాచవరం ప్రాంతాల్లో 200 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఏ గ్రామంలో ఎంత సేకరించాలి,  ఆ గ్రామాల్లో అసైన్డ్‌, పట్టాభూమి ఎంత ఉందో లెక్కగట్టారు. వీటికి సంబంధించిన సర్వే పూర్తిచేసి నెలలు గడచిపోతున్నా ఇంతవరకు సేకరణ ప్రక్రియ ఊసేలేదు. అవసరమైన 200 ఎకరాల్లో 10ఎకరాలు అసైన్డ్‌ భూమి, మిగిలిన 190 ఎకరాలు పట్టాభూమి ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సేకరించడానికి రూ.100 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఆయా గ్రామాల మీదుగా మచిలీపట్నం-విస్సన్నపేట జాతీయ రహదారి వరకు 8 కిలోమీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం భూములు గుర్తించడం తప్ప సమీకరణ ప్రారంభించలేదు. ఫలానా సమయంలో చేస్తామన్న విషయాన్ని కూడా పాలకులు స్పష్టత ఇవ్వడం లేదు. ఇలా క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకుండా పోర్టు నిర్మించేస్తామని చెప్పడం పట్ల ప్రజలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాలుపోని అధికారులు
ఓ పక్క ఇప్పటికే గుర్తించిన భూమి సమీకరణ జరగలేదు...తాజాగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు గుర్తించి సిద్ధం చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు అధికార వర్గాల చెబుతున్నాయి. మొదటి దశలో నిర్మించే నాలుగు బెర్తుల ద్వారా  ఆక్వా ఉత్పత్తులు, గ్రానైట్స్‌, సిమెంట్‌, ఇనుము బియ్యం ఇలా వివిధ రకాలు కలిపి 26.12 మిలియన్‌ టన్నులు కార్గో రవాణా జరుగుతుందని భావించి, దానికి అనుగుణంగా ఏర్పాటయ్యే పరిశ్రమల అవసరాలకు భూములు గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 3,778 ఎకరాల భూమిని ప్రభుత్వం మచిలీపట్నం పోర్టుకు కేటాయించింది. అందులో 1931 ఎకరాలు తొలివిడత పనులకు అవసరం అవుతాయని నిర్ణయించారు. మళ్లీ భూములు గుర్తించాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రోడ్డు, రైలుమార్గంతోపాటు ముందుగా పోర్టు సంబంధిత కార్యకలాపాలు నిర్వహించేందుకు గానూ వెంటనే పోర్టు భవనం నిర్మించాల్సి ఉంది. ఇందుకు 26 ఎకరాలు అవసరమవుతుంది. తపశిపూడి ప్రాంతంలో ఈ భూమిని అధికారులు గుర్తించారు. ఇది అసైన్డ్‌ అయినా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలామంది చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూమిపై ఎవరు అనుభవదారుడిగా ఉన్నా ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవచ్చు. ఆ అసైన్డ్‌భూముకు చెందిన రైతులకు కూడా డబ్బులు చెల్లించాలని పాలకులు పట్టుబడుతున్న తరుణంలో ప్రభుత్వ భూములు సేకరించడం అధికారులకు సవాలుగా మారింది.

ఇది నిరంతర ప్రక్రియ
పోర్టు నిర్మాణంతోపాటు పరిశ్రమల ఏర్పాటు తదితర అవసరాలకు భూములు సమీకరించడం అనేది నిరంతర ప్రక్రియ. దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు, రైలు మార్గం అనుసంధానానికి వివిధ గ్రామాల్లో గుర్తించిన భూముల సమీకరణకు అవసరమైన నిధులు ఉన్నాయి. నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తున్నాం. రైల్వేశాఖ అనుమతులు కూడా రావాల్సి ఉంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ఆదేశాలు వచ్చిన వెంటనే భూములు సమీకరిస్తాం. శాఖాపరంగా నిర్వహించే పనులు వేగవంతం చేసేలా కృషి చేస్తున్నాం.

-విద్యాశంకర్‌, మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని