logo

స్టేట్‌ క్యాపిటల్‌ కేటగిరీలో బెజవాడ ప్రథమం

జాతీయ స్థాయి స్వచ్ఛత నగరాల జాబితాలో విజయవాడ వెనుకబడింది. గతం కంటే రెండు ర్యాంకులు పడిపోయింది. మరోవైపు స్టేట్‌ క్యాపిటల్‌ విభాగంలో మాత్రం మొదటి వరుసలో నిలిచింది.

Updated : 02 Oct 2022 04:42 IST

స్వచ్ఛతలో ఐదో స్థానానికి పరిమితం

అవార్డులతో విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అధికారులు

విజయవాడనగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి స్వచ్ఛత నగరాల జాబితాలో విజయవాడ వెనుకబడింది. గతం కంటే రెండు ర్యాంకులు పడిపోయింది. మరోవైపు స్టేట్‌ క్యాపిటల్‌ విభాగంలో మాత్రం మొదటి వరుసలో నిలిచింది.  స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది స్వచ్ఛ నగరాల జాబితాలో విజయవాడ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలవగా, ఈ సారి కచ్చితంగా 1, 2 స్థానాల్లో నిలుస్తుందని అధికారులు భావించినా, ఐదోస్థానానికి పరిమితమైంది. జాతీయ స్థాయిలో స్థానిక సంస్థల విభాగంలో పెద్దనగరాల జాబితా(10-40 లక్షల జనాభా) కింద ఈసారి పలు నగరాలను అవార్డు కోసం ఎంపిక చేయగా, మధ్యస్థాయి నగరాల జాబితాలో(3-10 లక్షల జనాభా) మరికొన్ని నగరాలు, పట్టణాలను చేర్చారు.  స్టేట్‌ క్యాపిటల్‌ జాబితాలో మరికొన్ని నగరాలకు అవార్డులు ప్రకటించగా,విజయవాడ మొదటిస్థానంలో నిలిచింది.
అంశాలవారీ స్కోరింగ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు సంబంధించి మొత్తం వివిధ విభాగాల కింద 7,500 మార్కులు కేటాయించారు. అందులో విజయవాడ   6,699 మార్కులు మాత్రమే సాధించింది.  దిల్లీలో శనివారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ చేతుల మీదుగా విజయవాడ నగరం తరఫున పురపాలక శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి  అవార్డు అందుకున్నారు. దీంతో అవార్డు స్వీకరణ కోసం నగర కమిషనర్‌ స్విప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ , ఏసీ(పి) సత్యవతి, చీఫ్‌ మెడికల్‌ అధికారి రత్నావళి కూడా వెళ్లారు. నగరానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి సహకరించిన ముఖ్యమంత్రితోపాటు, అందుకు కృషిచేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరికీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అవార్డు దక్కడం నగరానికి గర్వకారణమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని