logo

అమలుకాని నిషేధం ఆచరణలో వైఫల్యం

యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవటంలేదు.

Published : 03 Oct 2022 05:46 IST

పెడనలో యథేచ్ఛగా ప్లాస్టిక్‌ వినియోగం
ప్రేక్షక పాత్రలో పురపాలక అధికారులు
పెడన, న్యూస్‌టుడే

సీజ్‌ చేసిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులు (పాత చిత్రం)

యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుకు నోచుకోవటంలేదు. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో ఆనెల ప్రారంభంలో మున్సిపల్‌ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా పట్టణ వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. ఇందులో పట్టుబడిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులను మున్సిపల్‌ డంపింగ్‌ యార్డుకు తరలించి ధ్వంసం చేశారు. దీంతో అప్పట్లో వర్తకులు, వినియోగదారులు కూడా నిషేధిత ప్లాస్టిక్‌ను వాడేందుకు వెనుకంజ వేశారు. కొద్దిరోజుల తరువాత పరిస్థితులు మామూలయ్యాయి.

నిలిచిన తనిఖీలు: గత రెండ్నెళ్లుగా పట్టణంలో మున్సిపల్‌ అధికారులు దాడులు చేయలేదు.ఫలితంగా ప్లాస్టిక్‌ వినియోగం తిరిగి మొదలైంది. ప్రధానంగా హోటళ్లు, పచారీ, మాంసాహార తదితర దుకాణాల్లో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ గ్లాసుల వినియోగం పూర్వస్థితికి చేరుకుంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రోజుకు దాదాపు 500 కిలోలకు పైగా నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నట్లు ఒక సర్వే ద్వారా వెల్లడైంది. వాటిని వినియోగించిన తర్వాత రహదార్లపై పడేయటంతో ఆవ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఫలితంగా యార్డులో ఆయా ఉత్పత్తులు పేరుకుపోతున్నాయి. నిబంధనలను కాదని ఎవరైనా వినియోగిస్తే రూ.5వేల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదట్లో జరిమానాలు విధించడంతో వర్తకులు వెనుకంజ వేశారు. ఆ తర్వాత పట్టించుకోపోవటంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇటీవల ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను కూడా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినా అది కూడా అమలు కావడం లేదు.

డంపింగ్‌ యార్డ్‌లోకి చేరుతున్న వ్యర్థాలు

యథేచ్ఛగా టోకు విక్రయాలు: పెడనకు విజయవాడ నుంచి నిషేధిత ప్లాస్టిక్‌ సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. విజయవాడ పరిసరాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్‌ గ్లాసులు,  ప్లేట్లను పెడనకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఇలా విజయవాడలోని టోకు వర్తకుల నుంచి పెడనలోని రిటైల్‌కు చేరుతున్నాయి. అక్కడి నుంచి వినియోగదారులకు అందుతున్నాయి. అధికారులు ప్రారంభంలో దాడులు చేయడంతో ప్రతి దుకాణం ఎదుట చేతి సంచులు ఇవ్వమని బోర్డులు పెట్టారు. కొంతమంది ఆస్థానంలో నార సంచులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్‌తో పోల్చితే వాటి ధరలు అధికం కావడంతో ఆ తర్వాత వెనుకంజ వేసి తిరిగి ప్లాస్టిక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పెడనలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తాం. పట్టణంలో వినియోగం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సచివాలయ సిబ్బందితో దాడులు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశిస్తాం. పట్టణంలోని 9 వార్డు సచివాలయాల అడ్మిన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. సచివాలయాల పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగం జరిగితే అక్కడి ఉద్యోగుల్ని బాధ్యులు చేస్తాం.

- బీజీఎల్‌ జ్యోత్స్నారాణి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts