logo

ధాన్యం.. రైతు దైన్యం..!

ఏటా పంట చేతికొచ్చే సమయంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Updated : 27 Nov 2022 06:14 IST

బందరు మండలం పోతేపల్లిలో వెంచర్‌లో ఆరబెట్టిన ధాన్యం

మచిలీపట్నం కార్పొరేషన్‌, తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: ఏటా పంట చేతికొచ్చే సమయంలో సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల వచ్చిన వాయుగుండం నుంచి తప్పించుకున్నామని సంతోషిస్తున్న సమయంలోనే మళ్లీ అల్పపీడనం ఏర్పడటం, పలు చోట్ల వర్షాలు పడటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి మంచి దిగుబడులు వస్తుండగా, వాతావరణంలో వస్తున్న మార్పులు, క్షేత్రస్థాయిలో తేమ శాతం నిబంధనతో ఏమి చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. చేలో పంట చేతికి అందేనా?

వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలను బట్టి  ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. గూడూరు, మొవ్వ, పెడన, గుడ్లవల్లేరు తదితర మండలాల్లో చేసిన పంట కోత ప్రయోగాల్లో కూడా 36 బస్తాలకు పైగా దిగుబడులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలు పడడంతో పండిన పంట చేతికొస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 3.94 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కోతలు కోశారు. ప్రస్తుతం 25 వేల ఎకరాలకు పైగా కోతలు పూర్తయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని మండలాల్లో పంట కోతకు రాగా, చాలామంది ఆకాశం మేఘావృతం అయ్యిందని కోతలు కోయడానికి ఆలోచిస్తున్నారు.

తోట్లవల్లూరులో నీటిలో నానుతున్న పనలు

బాధ్యత ఎవరిది..?

వాయుగుండం, అల్పపీడన సమస్యలతోపాటు కూలీల కొరత తదితర కారణాలతో రైతులు ఎక్కువశాతం మంది యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏమాత్రం రైతులను ఆదుకోలేక పోతున్నాయి. వ్యాపారుల ప్రమేయం లేకుండా కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వం విధించిన నిబంధన అన్నదాతల పాలిట శాపంలా తయారైంది. కేంద్రాలకు విక్రయించాలంటే తేమ 17 శాతం లోపు ఉండాలి. ఆ నిబంధనతో ప్రస్తుతం ధాన్యాన్ని విక్రయించడం సాధ్యమా అంటే రైతులు నూరుశాతం వీలుకాదని అంటున్నారు. ఒక వేళ ఆరబెట్టాలన్నా ఎక్కువ ఖాళీ ప్రదేశాలు లేవు.  చాలా చోట్ల ధాన్యం రహదారుల పక్కన, పొలాల దిబ్బలపైన రాశులుగా ఉండిపోయింది. వారం, పదిరోజుల పాటు ఆరబెట్టాలంటే పరదాలకు కూడా ఖర్చుకు ఎక్కువ అయిపోతుందని, ఈలోపు వర్షం పడి పంట నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, పెడన తదితర మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..


ఇన్ని నిబంధనలా..!

8 ఎకరాల ధాన్యం విక్రయించడానికి సిద్ధంగా ఉంది. కొనుగోలు కేంద్రానికి వెళితే ఆరబెట్టి తీసుకురావాలంటున్నారు...అంత ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలి. మా పొలం పక్కన మిల్లు ఉంది. ట్రాక్టర్‌తో తీసుకెళ్లి ఇస్తే డబ్బులు ఇచ్చేవాళ్లు. మా ధాన్యం అమ్మడానికి కూడా ఇన్ని నిబంధనలు ఏమిటో అర్థం కావడంలేదు.

ప్రత్తిపాటి శ్రీనివాసరావు, రైతు, మల్లవోలు


ఆరబెడితే మంచి ధర వస్తుంది

ఆరబెడితే మంచి ధర వస్తుందన్న విషయాన్ని రైతులు గమనించాలి. యంత్రాలతో కోసే సమయంలో మట్టి, తాలు లాంటివి రాకుండా జల్లెడ ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తేమశాతం ఎక్కువ ఉన్నా కేంద్రాలను సంప్రదిస్తే పరిశీలించి ధర నిర్ణయిస్తారు.

శ్రీధర్‌, పౌరసరఫరాల సంస్థ,  మేనేజర్‌


జాగ్రత్తలు పాటిస్తే కాపాడుకోవచ్చు

రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పంటను కాపాడుకోవచ్చు. పల్లపు పొలాల్లో నీరు నిల్వకుండా కాలువలు తీసి బయటకు తరలించాలి. తడిసిన పనలు మొలకలు రాకుండా వరిపై ఒక లీటరు నీటిలో 5 శాతం ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలి.

నాగేశ్వరరావు, ఏవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని