logo

డబ్బులివ్వలేదని దాడులు.. ప్రశ్నిస్తే బెదిరింపులు

పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న విద్యార్థులను డబ్బులివ్వాలని బెదిరించడం, ఇవ్వకపోతే దాడి చేయడం, ప్రశ్నించిన ఉపాధ్యాయులను చంపేస్తామనడం.

Published : 01 Dec 2022 06:12 IST

విద్యార్థులపై బ్లేడ్‌బ్యాచ్‌ దారుణాలు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న విద్యార్థులను డబ్బులివ్వాలని బెదిరించడం, ఇవ్వకపోతే దాడి చేయడం, ప్రశ్నించిన ఉపాధ్యాయులను చంపేస్తామనడం... విజయవాడలో బ్యాడ్‌బ్లేచ్‌ ఆగడాలివి. ఇటీవల కాలంలో వీరు మరింత రెచ్చిపోతున్నారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విద్యార్థిపై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొగల్రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి సోమవారం సాయంత్రం బడి నుంచి ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో కొందరు యువకులు అతడిని ఆపి డబ్బులు ఇవ్వమని అడిగారు. ఆ బాలుడు తన వద్ద లేవని చెప్పడంతో, ఇంటికి వెళ్లి తీసుకురమ్మన్నారు. విద్యార్థి నిరాకరించడంతో అతనిపై దాడి చేసి, బ్లేడుతో చేతిని గాయపరచారు. పక్కనే ఉన్న అతని అన్నయ్య వారి నుంచి తమ్ముడిని కాపాడడానికి ప్రయత్నించగా, అతనిపైనా దాడిచేశారు. ఇద్దరూ తప్పించుకుని గాయాలతో ఇంటికి చేరుకుని, విషయాన్ని తల్లిదండ్రులకు  చెప్పారు. వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి చర్యలు లేవు. ఈ నేపథ్యంలో  తమ పాఠశాల వద్ద ఆకతాయిలు ఎక్కువగా ఉంటున్నారని, బందోబస్తు ఏర్పాటు చేయాలని బుధవారం ప్రధానోపాధ్యాయుడు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌.ఐ. నాగమణికి విన్నవించారు. సిబ్బందిని పంపుతామని చెప్పడంతో ఆయన వెనుదిరిగారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఆగడాలు

ఈ ప్రాంతానికి చెందిన 10 మంది యువకులు పాఠశాల సమీపంలో తిష్ఠ వేస్తున్నారు. స్కూలు వదిలిన తర్వాత అటుగా వస్తున్న విద్యార్థులను నిత్యం వేధిస్తున్నారు. ఇటీవల ఒక బాలుడు డబ్బులు తీసుకురాలేదని చెప్పి, కూల్‌ డ్రింక్‌లో టాబ్లెట్‌ కలిపి తాగించారు. బాలుడు విషయాన్ని తల్లిదండ్రుల  దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఆ యువకులను ప్రశ్నిస్తే మరింత ముప్పు వస్తుందనే భయంతో వారు మిన్నకున్నారు. పాఠశాల నుంచి వెళుతున్న బాలికల పట్ల వారు అసభ్యకరంగా ప్రవర్తించడం, బైక్‌లపై వెళుతూ విద్యార్థుల మధ్యగా పోనివ్వడం లాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. చివరకు విద్యార్థులపై దాడి చేసేస్థాయికి వెళ్లింది. కొందరు ఈ విషయాలను పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకుని వెళ్లారు. వారు వెళ్లి.. యువకులను గట్టిగా హెచ్చరించారు. దీంతో వారు మరింత రెచ్చిపోయి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వారు ఏం చేయలేక ఊరుకున్నారు.

ఫిర్యాదు చేసినా..

గతంలో రెండు సార్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ సమయంలో ఒక వారం రోజుల పాటు సిబ్బంది తిరిగారు. ఆ సమయంలో ఆ దరిదాపుల్లో ఆకతాయిలు రాలేదు. తర్వాత పోలీసులు ఇటువైపు రాకపోవడంతో బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలు నిత్యకృత్యంగా మారుతాయి. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల వద్ద నిఘాను ఏర్పాటు చేయాలని, యువకులపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు  కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని