logo

అన్నం... పచ్చడి... రూ.20

పచ్చడితో అన్నం పెట్టి,   ఆయాతో కర్రీ తెప్పించుకోమని రూ.20 పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఇవ్వడం ఇప్పుడు చాలా ఇళ్లల్లో కనిపిస్తోంది. యూకేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు తెచ్చుకుంటున్న లంచ్‌ బాక్సులను పరిశీలిస్తే దాదాపు 30 శాతం ఇలానే ఉంటున్నాయి.

Updated : 04 Dec 2022 16:45 IST

బడుల్లో సుమారు 30 శాతం ‘లంచ్‌ బాక్సుల’ తీరు
న్యూస్‌టుడే, గుణదల

పచ్చడితో అన్నం పెట్టి, ఆయాతో కర్రీ తెప్పించుకోమని పాఠశాలలకు వెళ్లే పిల్లలకు రూ.20 ఇవ్వడం ఇప్పుడు చాలా ఇళ్లల్లో కనిపిస్తోంది. యూకేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు తెచ్చుకుంటున్న లంచ్‌ బాక్సులను పరిశీలిస్తే దాదాపు 30 శాతం ఇలానే ఉంటున్నాయి. విద్యార్థులు తరచూ అనారోగ్యాలకు గురవుతూ బడులకు డుమ్మా కొడుతున్నారు. మధ్యాహ్న భోజనం బెల్‌ కొట్టడానికి ముందు ప్రతి తరగతి గదికి ఆయాలు వెళ్లి ఎవరికి ఏం కూరలు తేవాలో అడిగి పట్టిక తెచ్చుకుంటున్నారు.  

బడి బస్సుల సమయాలు:

నగరాలు, పట్టణాల్లోని పాఠశాలలు ఉదయం 8:30 గంటలకు మొదలైతే, ఆయా బడులకు పిల్లలను తీసుకువచ్చే బస్సులు, ఇతర వాహనాల పయనం ఉదయం 6:30 నుంచే మొదలవుతుంది. ఆ సమయానికి రెడీ కావాలంటే వారు, కుటుంబం మొత్తం కనీసం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేవాలి. ఏం తేడా వచ్చినా పిల్లలకు పచ్చడి మెతుకులే గతి.

రాత్రి ఆలస్యంగా నిద్ర పోవటం:

వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే పెద్దలు, బడుల నుంచి పిల్లలు రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఇళ్లకు చేరుకుంటున్నారు. అనంతరం స్నానపానాదులు పూర్తి చేసుకుని రాత్రి భోజనం చేసి వెంటనే నిద్రపోవటం అనేది నేటి పరిస్థితుల్లో సాధ్యం కావటం లేదు. పిల్లలు ఆన్‌లైన్‌ గేమ్స్‌, పెద్దలు సామాజిక మాధ్యమాలలో మునిగిపోయి... వారు నిద్ర పోయే సమయం అర్ధరాత్రికి కొంత అటూఇటూగా ఉంటుంది. దీనితో తెల్లవారుజామున  నిద్ర లేవటం అనేది వారికి కష్టతరంగా మారుతుంది. ఫలితం లంచ్‌ బాక్స్‌పై పడుతుంది.

ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావటం:

ఇప్పుడు అత్యధిక శాతం కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల  పని ఒత్తిడి, రాకపోకల సమయం వంటి వాటి వల్ల జీవన శైలి హడావుడిగా మారుతోంది. ఈ కారణాలన్నింటితో పాటు ఇంటి పట్టున ఉండే కొందరు సాధారణ గృహిణులు పంపే లంచ్‌ బాక్సులూ అన్నం పచ్చడితోనే ఉంటున్నాయని ఆయాలు చెబుతున్నారు.

సమయ పాలన పాటిస్తే అంతా బాగు

సమయపాలనే ముఖ్యమని గుణదలకు చెందిన వాణి అనే ఉద్యోగిని చెబుతున్నారు. ఉద్యోగి అయిన తన భర్త, ఇద్దరు టీనేజ్‌ పిల్లలు అంతా ఉదయమే బయటకు పోవాలి. అందుకే అందరం కలసి పనిచేసుకుంటాం. ఉదయం లేచాక కాసేపు వ్యాయామం, ధ్యానం చేశాక అల్పాహారం మొదలు సాయంత్రం వరకు అవసరమైన పోషకాహారాన్ని సిద్ధం చేసుకుని ఎవరి బాక్స్‌లు వారు కట్టుకుంటాం. ఎక్కడా ఒత్తిడికి గురవ్వకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నామని వాణి  చెబుతున్నారు.


చిప్స్‌ నంజుకోవడం

క్యాంటీన్‌లో చిప్స్‌ ప్యాకెట్‌ కొనుక్కోమని కొందరు గృహిణులు పిల్లలకు చెబుతున్నారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి  చిప్స్‌, చాక్లెట్‌ ఇస్తున్నారు. కొన్ని మినహాయిస్తే చాలావరకు చిప్స్‌కు ఎంఎస్‌జీ (మోనో సోడియం గ్లోటెమేట్‌) అనే లవణ పదార్థం వాడతారు. అధికమైన కొవ్వు పదార్థం ఉంటుంది. ఫలితంగా విద్యార్థులు దేనిపైనా అంతగా ఆసక్తి చూపలేకపోవడం,  ఒక చోట నిలకడగా ఉండలేకపోవడం ఇతర సమస్యలు వస్తున్నాయి.

డా.చందు విన్నెల, విజయవాడ


ఆహారమే ఆయుష్షు

పిల్లలకైనా, పెద్దలకైనా ఆహారమే ఆయుష్షు అని అందరూ తెలుసుకోవాలి. రోజూ సుమారు రెండు గంటలు దీని తయారీకి వెచ్చిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. రోజూ ప్రతి ఒక్కరికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మినరల్స్‌, కొవ్వులు కచ్చితంగా కావాలి. జంక్‌ ఫుడ్స్‌ కారణంగా ఏ, డీ, ఈ, కే విటమిన్లు లోపాలు వస్తున్నాయి. ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

డాక్టర్‌ వెంకటరమణ, పిల్లల వైద్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని