logo

పంపిణీ ఉన్నట్టా.. లేన్నట్టా?

‘ఈ నెల 21న సీఎం పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభకు అక్కడే ఏర్పాట్లు చేయాలి.

Published : 05 Dec 2022 05:35 IST

పూర్తికాని మౌలిక సౌకర్యాల పనులు
త్రిశంకు స్వర్గంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
ఈనాడు, అమరావతి

వాటర్‌హెడ్‌ ట్యాంకు కోసం తీస్తున్న గుంత

‘ఈ నెల 21న సీఎం పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభకు అక్కడే ఏర్పాట్లు చేయాలి. పక్కనే ఉన్న వరి పొలంలో రెండో పంట సాగు చేయవద్దు..! సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోండి..!’ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని) గత నెలలో చెప్పిన మాటలు..!

పై చిత్రం పరిశీలించారా..!

గుడివాడ టిడ్కో ఇళ్ల సమీపంలో ఉన్న పొలాలు. రైతులు శనివారం దమ్ము చేయిస్తున్నారు. దాదాపు 14 ఎకరాలు. ముందుగా రెండో పంట మినుము సాగు చేస్తారు. వరి కోతలు అయిన వెంటనే మినుము విత్తనాలు చల్లుతారు. ఈ సమయానికి మొలకెత్తాల్సి ఉంది. కానీ మాజీ మంత్రి ఆదేశాలతో రైతులు విత్తనాలు వేయలేదు. అధికారులు కౌలు సొమ్ము చెల్లిస్తామని ముందు చెప్పి ఇప్పుడు లేదని అంటున్నారు. దీంతో రైతులు దమ్ము చేసి కొంత ఆరిన తరన్వాత మినుము విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారుల వ్యవహారం వల్ల రైతులకు పంట జాప్యం కావడమే కాకుండా దమ్ము చేసేందుకు అదనపు వ్యయం భారంగా మారింది. ఎకరానికి రూ.1500 వరకు ఖర్చు అవుతోంది. ఇంతకీ 21న సీఎం కార్యక్రమం ఉందా లేదా అనేది సందేహం. సీఎం కార్యక్రమం ఉంటే.. మళ్లీ పైరు ఎక్కడ తొక్కేస్తారోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. వీరంతా కౌలు రైతులు కావడం గమనార్హం. 

అసంపూర్తిగానే..!

టిడ్కో ఇళ్లు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ సీఎం ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా గుడివాడలో ఈ కార్యక్రమం ఈనెల 21న ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ధ్రువీకరణ కాలేదు. ఉంటుందా లేదా అనేది అధికారులు సైతం ధ్రువీకరించడం లేదు. బహిరంగ సభ పేరుతో రైతులను పంట సాగు చేయవద్దని మాజీ మంత్రి హెచ్చరించడం వివాదంగా మారింది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కానీ ప్రారంభోత్సవానికి హడావుడి చేస్తున్నారు. గుడివాడలో జిల్లాలోనే అత్యధికంగా 8912 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి తెదేపా హయాంలో జిల్లాలో మొత్తం 91వేల ఇళ్లు మంజూరు కాగా.. వాటిని ప్రస్తుతం 27,872కే కుదించారు. అంతవరకు పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికే బ్యాంకుల నుంచి రుణాలు లభించడం లేదు. మౌలిక వసతులు కల్పించలేక ఆపసోపాలు పడుతున్నారు.
* విజయవాడ జక్కంపూడి కాలనీలో భారీ ఎత్తున అయిదు దశల్లో దాదాపు 55వేల ఇళ్లు నిర్మాణం చేపట్టాలనేది లక్ష్యం. వీటికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అలాట్‌మెంట్‌ పత్రాలు కూడా అందజేశారు. ఇప్పుడు వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ 6576 మాత్రమే నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతుల ఊసేలేదు. ఇంకా విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదు. మరుగుదొడ్లు నిర్మాణం చేసినా సెప్టెక్‌ ట్యాంకులు నిర్మాణం చేయలేదు. మంచినీటి వసతి కల్పించలేదు. ఇవి నివాసయోగ్యంగా మారాలంటే పూర్తి స్థాయిలో వసతులు కల్పించాల్సి ఉంది. రహదారి సౌకర్యం లేదు. కొండచుట్టూ నిర్మాణం చేశారు.
* జగ్గయ్యపేట, మచిలీపట్నం, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, నూజివీడులలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కావడం లేదు. మౌలిక వసతుల మాట దేవుడెరుగు అన్నట్లు ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. * జిల్లాలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లలో డిసెంబరులో గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. కనీసం 2,500 టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలను చేయాలనేది లక్ష్యం. గృహప్రవేశాలు చేసినా నివాసం ఉండేందుకు మరికొంత గడువు పడుతుంది. అధికారులు మాత్రం గుడివాడలో సీఎం కార్యక్రమంపై పెదవి విప్పడం లేదు. ఉంటుందో ఉండదో ఏదీ తేల్చుకోలేని పరిస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు