logo

సుబాబుల్‌ రైతుల నిలువు దోపిడీ!

సుబాబుల్‌ రైతులను కొన్ని కాగిత కర్మాగారాలు, దళారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. టన్నుకు రూ. 4200 ఒప్పంద ధర ఇవ్వాల్సి ఉండగా.. రైతు చేతికి రూ.2400 రావడం గగనంగా మారింది.

Published : 05 Dec 2022 05:48 IST

నందిగామ, న్యూస్‌టుడే

లారీకి కర్ర ఎక్కిస్తున్న కూలీలు

సుబాబుల్‌ రైతులను కొన్ని కాగిత కర్మాగారాలు, దళారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. టన్నుకు రూ. 4200 ఒప్పంద ధర ఇవ్వాల్సి ఉండగా.. రైతు చేతికి రూ.2400 రావడం గగనంగా మారింది. వాస్తవానికి లారీ కిరాయి, కర్ర లోడింగ్‌ ఛార్జీలు కాగిత కర్మాగారాలు భరించాలి. అందుకు విరుద్ధంగా ఆయా ఛార్జీలను ఒప్పంద ధరలోనే కోత విధిస్తున్నారు. గతంలో ఉన్న డంపింగ్‌ యార్డుల వ్యవస్థ, మార్కెట్‌ యార్డుల పర్యవేక్షణ రద్దు చేశారు. ప్రస్తుతం ట్రేడర్ల ద్వారా కర్మాగారాలు కర్ర కొనుగోలు చేస్తుండగా.. సరైన ధర లభించక రైతులు మాత్రం  భారీగా నష్టపోతున్నారు.

50 వేల ఎకరాల్లో..

ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో సాగు ఉంది. కర్మాగారాలకు ఉన్న కర్ర డిమాండ్‌కు అనుగుణంగా ఒప్పంద ధరకు రెండు, మూడు వందల రూపాయలు పెంచడం, తగ్గించడం చేస్తున్నారు. లారీ కిరాయి పెరిగిందని చెప్పి ఆ మేరకు కోత విధిస్తున్నారు. ఫలితంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. నందిగామ, వత్సవాయి మండలాలకు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలోని మధిర, బోనకల్లు ప్రాంతంలో ఒక కర్మాగారం టన్నుకి రూ.2600 చెల్లిస్తుండగా, ఏపీలో మాత్రం రూ. 2400 ఇస్తోంది. ఒక కర్మాగారం ప్రతినిధులు నందిగామ ప్రాంతంలో కంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో టన్నుకి రూ. 200 తక్కువ చెల్లిస్తోంది. ఆ మేరకు రైతులు నష్టపోతున్నారు. వాస్తవంగా రైతులు కర్ర నరికించినందుకు, డంపింగ్‌ యార్డు వద్దకు రవాణా చేయడానికి అయ్యే ఖర్చు తీసి వేస్తే సుమారు రూ.3450 వరకు అందాలి. కానీ వివిధ ఖర్చుల రూపేణా కోత పెట్టి రూ.2400 వరకు ఇస్తున్నారు. మార్కెట్‌ యార్డుల పర్యవేక్షణలో కొనుగోలు చేసేందుకు డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలి. లారీ కిరాయి, లోడింగ్‌ ఖర్చులు పేపరు కర్మాగారాలే భరించేలా చర్యలు తీసుకోవాలి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా కనీసం టన్నుకు రూ. ఐదు వేల ధర లభించేలా చూడాలి. దళారులు, ట్రేడర్ల వ్యవస్థ రద్దు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

నాడు పాదయాత్ర.. నేడు పట్టించుకోరు

అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఏమీ పట్టించుకోవట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాలని పాదయాత్రలు, ఆందోళనలు చేసిన ముఖ్య నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు విప్పట్లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక టన్నుకి రూ. ఐదు వేలు ఇస్తామని నందిగామ ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మూడున్నరేళ్లయినా పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సుబాబుల్‌ రైతుల సమస్యలపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినా నేటికీ నిర్ణయం తీసుకోలేదు. ఏటా తీవ్రంగా నష్టపోతున్నా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని