logo

ధగధగల మాటున.. దగా

అది టోకు, చిల్లర అమ్మకాలు జరిపే బంగారం నగల దుకాణం. అక్కడికి వెళ్లిన వినియోగదారులను మొదట సిబ్బంది అడిగే ప్రశ్న.. బిల్లు కావాలా..? అయితే 3శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. బి

Updated : 08 Feb 2023 12:16 IST

రూ.కోట్లలో పన్ను ఎగవేత

ఈనాడు, అమరావతి: అది టోకు, చిల్లర అమ్మకాలు జరిపే బంగారం నగల దుకాణం. అక్కడికి వెళ్లిన వినియోగదారులను మొదట సిబ్బంది అడిగే ప్రశ్న.. బిల్లు కావాలా..? అయితే 3శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు లేకుండా అయితే.. ఇది మిగులుతుంది. బంగారం నాణ్యత, బరువు, దుకాణ యజమానిపై నమ్మకంతో ఎక్కువ శాతం బిల్లులు లేకుండానే కొనుగోలు చేస్తుంటారు. ఆ ఆభరణం వెంటనే అదే దుకాణాల సముదాయంలో నాణ్యత, తూకం పరీక్ష చేయించుకోవచ్చు. రూ.50 చెల్లిస్తే.. నాణ్యత ఎంత ఉంది..? తూకం ఎంత ఉంది..? ధ్రువీకరణ ఇస్తారు. దీంతో ఎక్కువ మంది వినియోగదారులు బిల్లులు లేకుండానే ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వ పన్నుల విభాగానికి రూ.కోట్లలో నష్టం వస్తుంది. అంతా అక్కడ ‘జీరో’ వ్యాపారమే! వ్యాపారులు కొనుగోలు చేసిన దానిపై పన్నులు ఉండవు. విక్రయించే దానిపై పన్నులు ఉండవు.  

ముంబయి నుంచి నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యక్తి ఇటీవల బంగారు ఆభరణాలు.. తీసుకొస్తుండగా విజయవాడ టాస్క్‌ఫోర్సు పోలీసులకు చిక్కారు. అంతే క్షణాల్లో వాట్సప్‌లో బిల్లులు ప్రత్యక్షమయ్యాయి. అంతా గప్‌చుప్‌..!

ఓ కొనుగోలుదారుడు రూ.10లక్షల విలువ చేసే హారం  ఓ దుకాణంలో కొనుగోలు చేశారు. బయట మార్కెట్‌లో దీనికి కనీసం 15 శాతం నుంచి డిజైను బట్టి 22 శాతం వరకు వీఏ (వాల్యూ యాడెడ్‌, తరుగు) వసూలు చేస్తారు. కానీ ఆ దుకాణంలో 5శాతం నుంచి 6శాతం వసూలు చేస్తారు. దీంతో కొనుగోలుదారులు ఆకర్షితులు అవుతారు. 3శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.10లక్షల విలువపై దాదాపు రూ.30వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మిగులుతుంది.  విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ దుకాణాల సముదాయం, మరో ప్రైవేటు దుకాణాల సముదాయం ఈ జీరో వ్యాపారానికి పెట్టింది పేరు. గవర్నర్‌పేటలో, ఒకటో పట్టణంలో రోజుకు కనీసం రూ.30కోట్ల నుంచి 40 కోట్ల వరకు జీరో వ్యాపారం జరుగుతుందని అంచనా. నెలకు సుమారు రూ.50కోట్ల వరకు జీఎస్టీ ఎగవేస్తున్నారు. జీఎస్‌టీతో పాటు ఆదాయ పన్నులోనూ కోత పడుతోంది.  

ఠంచనుగా లంచాలు..

ఒక సిండికేట్‌ ద్వారా కొంతమంది ఉద్యోగులకు లంచాలు అందుతుంటాయి. కేసులు అవసరమైతే వెండి ఆభరణాలపై ఒకటీ అరా నమోదు చేస్తుంటారని తెలిసింది. బంగారం వ్యాపారానికి మాత్రం వెళ్లరు. ఆదాయపుపన్ను శాఖ వాళ్లు పట్టుకున్నప్పుడు, దొంగలపాలైనప్పుడు రశీదులు అవసరం ఉంటాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తెరగడం లేదు.  

ఇదీ పరిస్థితి..

విజయవాడలో బంగారు ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ది చెందిన దుకాణ సముదాయంలో బడా నగల దుకాణాల కంటే వీఏ తక్కువగా ఇస్తుంటారు. జీఎస్‌టీ వసూలు చేయరు. అయితే సొమ్ములు మొత్తం నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాలకు ఆభరణాలను తరలిస్తుంటారు. వాటికి జీఎస్‌టీ వసూలు చేయరు. ఆ దుకాణాల వైపు పన్నుల శాఖ అధికారులు అసలు కన్నెత్తి చూడరు. తూనికలు-కొలతల శాఖ అధికారులు సైతం బడా సంస్థలు నిర్వహిస్తున్న దుకాణాలపై మాత్రమే తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ గ్రాము వద్ద బయట మార్కెట్‌ కంటే రూ.50 నుంచి 100 వరకు తగ్గింపు ఇస్తుంటారు. సాధారణంగా బిస్కెట్‌ బంగారం ప్యూరిటీ 99.99శాతం క్యారెట్లు ఉంటుంది. కానీ ఇక్కడ బంగారం 99.60శాతం ఉంటుందని ఓ వ్యాపారి వివరించారు. ఎక్కువగా బంగారం బిస్కెట్లు, ఆభరణాలు రైల్వే ద్వారా అక్రమ రవాణా అవుతున్నాయి. ఇలా బంగారం తెచ్చే వారిని కొంతమంది వెంబడించి దోచుకున్న సంఘటనలు నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనే జరిగాయి. విశాఖపట్నం వెళ్లే మార్గంలోనూ జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని