logo

రెండు మండలాలుగా మచిలీపట్నం

రాష్ట్రంలోనే అతిపెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గాల్లో మచిలీపట్నం ముందు వరుసలో ఉంటుంది. గతంతో పోల్చుకుంటే బందరం నగరం విస్తరించడంతోపాటు జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది.

Published : 09 Feb 2023 04:56 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

రాష్ట్రంలోనే అతిపెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గాల్లో మచిలీపట్నం ముందు వరుసలో ఉంటుంది. గతంతో పోల్చుకుంటే బందరం నగరం విస్తరించడంతోపాటు జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లా కేంద్రమైన మచిలీపట్నాన్ని అర్బన్‌, రూరల్‌ మండలాలుగా విభజించాలని బుధవారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు.  మచిలీపట్నం నగరపాలక సంస్థ అర్బన్‌ పరిధిలో ఉంటుంది.

బందరు 1866లోనే పురపాలక సంఘంగా ఏర్పడింది. బందరు పట్టణం, కంటోన్మెంట్‌ ప్రాంతం, సర్కారుతోట, మాచవరం, చిలకలపూడితో కలిపి మొత్తం 19.46 చదరపు మైళ్ల వైశాల్యంతో మున్సిపాలిటీగా రూపొందింది. అనంతరం 1925 ప్రాంతంలో ‘ఎ’ గ్రేడ్‌ పురపాలకసంఘంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 50 డివిజన్లతో నగరపాలకసంస్థగా కొనసాగుతోంది. 2011 జనగణన లెక్కల ప్రకారం బందరు నగరంలో 1.80లక్షల జనాభా ఉండగా ప్రస్తుతం 2లక్షలు దాటిపోయింది. బందరు మండలం కూడా 34 పంచాయతీలతో పెద్ద మండలంగా గుర్తింపు పొందింది. లక్ష ఎకరాల  ఆయకట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు మండలాలుగా మార్చాలని గతంలో అధికారులు ప్రతిపాదనలు చేశారు.

గతంలో ప్రతిపాదనలు ఇలా..

బందరు నగరంలోని కోనేరు సెంటరు నుంచి రాజుపేట, ఇనుగుదురుపేట, చింతగుంటపాలెం, శివగంగ  ప్రాంతాలతోపాటు చిన్నాపురం, రుద్రవర, పోలాటితిప్ప, కోన, భోగిరెడ్డిపల్లి, గుండుపాలెం ఇలా అటువైపు ఉన్న ప్రాంతాలను ఉత్తర మండలంగా మంగినపూడిబీచ్‌వైపు ఉన్న గ్రామాలతోపాటు, నగరంలోని డివిజన్లను దక్షిణ మండలంగా విభజించాలని కోరుతూ గతంలో ప్రతిపాదించారు.   మచిలీపట్నాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసే క్రమంలో మండలంలో ఉన్న 34 పంచాయతీల్లో సుల్తానగరం, అరిశేపల్లి, పోతేపల్లి, చినకరగ్రహారం, పెదకరగ్రహారం, మేకావానిపాలెం. గరాలదిబ్బ, రుద్రవరం, ఎస్‌ఎన్‌గొల్లపాలెం ఈ తొమ్మిది గ్రామాలను గతంలో నగరపాలకసంస్థలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత ఆ ప్రక్రియ వివిధ కారణాలతో ఆగిపోయింది. కొత్తగా మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లా కేంద్రాన్ని రెండు మండలాలుగా విభజించేందుకు విధివిధానాలు అందాల్సి ఉందని అధికారులు తెలిపారు.

నగర జనాభా: 1.80 లక్షలు

మండల జనాభా: 69,070

పురుషులు: 35,226

మహిళలు: 33,844

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని