logo

మనుబోలు-నెల్లూరు మార్గం విద్యుదీకరణ పూర్తి

మూడో లైను పనుల్లో భాగంగా విజయవాడ డివిజన్‌ పరిధిలోని మనుబోలు-నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య 29.3 కిమీ విద్యుదీకరణ పూర్తయి సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

Published : 21 Mar 2023 04:48 IST

అందుబాటులోకి వచ్చిన కొత్త రైల్వే లైన్‌

రైల్వేస్టేసన్‌ (విజయవాడ), న్యూస్‌టుడే : మూడో లైను పనుల్లో భాగంగా విజయవాడ డివిజన్‌ పరిధిలోని మనుబోలు-నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య 29.3 కిమీ విద్యుదీకరణ పూర్తయి సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ విద్యుదీకరణతో పాటు డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఈ పనులు చేపట్టింది. తీర ప్రాంతం వెంబడి గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో ఇది దోహదపడనుంది. ప్రయాణికులు, సరకు రవాణా రైళ్లు పెరగడంతో కీలకమైన ఈ మార్గం అత్యంత రద్దీగా మారింది. ఈ సెక్షన్‌లో రద్దీని తగ్గించేందుకు విజయవాడ-గూడూరు మూడో లైను ప్రాజెక్టులో భాగంగా 2015-16 సంవత్సరంలో 288కిమీ దూరానికి రూ.3246 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సెక్షన్ల మధ్య ఉత్తర, తూర్పు ప్రాంతాలను దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానించడంలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్‌వీఎన్‌ఎల్‌ సంస్థ ఈ పనులు చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా అన్ని పనులను ఏకకాలంలో చేపట్టారు. ఇప్పటి వరకు ఉలవపాడు-కావలి మధ్య 29 కిమీ దూరం, తలమంచి-బిట్రగుంట-శ్రీవెంకటేశ్వరపాలెం మధ్య 24.8కిమీ, కావలి-శ్రీవెంకటేశ్వరపాలెం మధ్య రూ.12.2కిమీ, తలమంచి-నెల్లూరు మధ్య 17కిమీ, కరవడి-చినగంజాం మధ్య 23.5 కిమీ మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనుబోలు-నెల్లూరు మధ్య 29.3కిమీ పనులు పూర్తి చేయడంతో విజయవాడ,గూడూరు సెక్షన్‌లో మొత్తం 135.8కిమీ పూర్తయి ప్రాంభించడం జరిగింది. ఈ మార్గంలో పనులను నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేసిన ఆర్‌వీఎన్‌ఎల్‌, విజయవాడ డివిజన్‌ అధికారులను రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ అభినందించారు. విజయవాడ-గూడూరు మూడో లైనును అత్యధిక ప్రాధాన్యతతో చేపడుతున్నామని అన్ని సెక్షన్లలో పనులు ఏకకాలంలో వేగంగా జరుగుతున్నాయన్నారు. మూడో లైను ప్రాజెక్టులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని విభాగాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని