logo

చెత్త పన్ను కట్టొద్దు : బొండా

వైకాపా ప్రభుత్వం విధించే చెత్త పన్నును కట్టవద్దని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 26 Mar 2023 04:53 IST

గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న ఉమామహేశ్వరరావు, సాంబశివరావు, సాయిరామ్‌ గౌడ్‌ తదితరులు

మొగల్రాజపురం (చుట్టుగుంట): వైకాపా ప్రభుత్వం విధించే చెత్త పన్నును కట్టవద్దని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. చెత్తపన్నుపై ఆదివారం ధర్నాచౌక్‌లో మహా ధర్నా చేస్తున్నామని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావుతో కలిసి ఆవిష్కరించారు. ఉమా మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. గత ఏడాది అగస్టులో విడుదల చేయాల్సిన ఆసరా.. ఈ ఏడాది మార్చిలో ఇచ్చారని విమర్శించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానుండడంతో.. నాలుగో విడత ఇచ్చేదెప్పుడని ప్రశ్నించారు. మహిళలకు ఆసరా అని టోకరా వేశారని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రూపుకు రూ.7.5లక్షలు రద్దు చేస్తానని హామీ ఇచ్చి, మడిమ తిప్పారని పేర్కొన్నారు. ప్రజలపై రూ.50వేల కోట్ల విద్యుత్తు భారం మోపుతున్నారని, విద్యుత్తు సర్‌ ఛార్జీల పేరుతో రూ.3వేల కోట్లు వసూలుకు ఏపీఆర్‌సీ రాష్ట్రంలోని నాలుగు డిస్కమ్‌లకు అనుమతించిందన్నారు. ఇంటి, నీటి, మరుగుదొడ్డి, చెత్త పన్నులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్నును రద్దు చేస్తామని నారా లోకేష్‌ ప్రకటించారని గుర్తు చేశారు. చెత్తపన్ను కట్టవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తున్నామని, ఎవరైనా కట్టమని ఒత్తిడి చేస్తే తెదేపా నాయకుల దృష్టికి తీసుకువస్తే ప్రజలకు అండగా ఉంటామని ఉమా పేర్కొన్నారు. పలు కార్పొరేషన్లపై తెచ్చిన రూ.1,18,000కోట్ల అప్పులను బడ్జెట్‌లో దాచాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అన్నీ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, దీనిపై ‘కాగ్‌’ నిలదీచిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. లుక్కా సాయిరామ్‌గౌడ్‌, ఘంటా కృష్ణమోహన్‌, చిన్న, శ్రీరామ్‌ ప్రసాద్‌, వెంకీ, పార్థునాయుడు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు