logo

‘45.72 మీటర్ల ఎత్తుతోనే పోలవరం నిర్మించాలి’

పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం 41.15 మీటర్ల ఎత్తు వరకే చేపడతామంటూ కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లద్‌ సింగ్‌ పటేల్‌ చేసిన ప్రకటనను తాము వ్యతిరేకిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ తెలిపారు.

Published : 28 Mar 2023 04:45 IST

కలెక్టర్‌ డిల్లీరావుకు వినతి పత్రం అందజేస్తున్న జల్లి విల్సన్‌, సి.హెచ్‌.కోటేశ్వరరావు, జి.కోటేశ్వరరావు, యలమందరావు తదితరులు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం 41.15 మీటర్ల ఎత్తు వరకే చేపడతామంటూ కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లద్‌ సింగ్‌ పటేల్‌ చేసిన ప్రకటనను తాము వ్యతిరేకిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ తెలిపారు. పోలవరం ఎత్తును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అన్ని జిల్లాల్లోని కలెక్టర్‌ కార్యాలయాల వద్ద దీక్షలు తలపెట్టినట్టు చెప్పారు. పోలవరం ఎత్తును తగ్గించ వద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ.. వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో నిర్మిస్తే.. 7.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, 960 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చన్నారు. 80 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణాకు తరలించడం ద్వారా ఆదా చేసే నీటిని, శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని రాయలసీమ సాగు అవసరాలకు మళ్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్‌.కోటేశ్వరరావు, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి మల్నీడు యలమందరావు, నరసింహారావు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని