logo

నేతల సిఫార్సుతోనే స్వాహా

ముందస్తు ప్రణాళిక ప్రకారం బీమా చేయించారు.. పక్కా పథకం ప్రకారం పరిహారం స్వాహా చేశారు. దీనికి తోడు అధికార పార్టీ నేతల సిఫార్సులు వినియోగించారు.

Published : 30 Mar 2023 02:13 IST

నిబంధనలకు బ్యాంకు తిలోదకాలు
పంచాయితీకి రావాలని ఒత్తిళ్లు
న్యూస్‌టుడే, పటమట, విజయవాడ సిటీ

ముందస్తు ప్రణాళిక ప్రకారం బీమా చేయించారు.. పక్కా పథకం ప్రకారం పరిహారం స్వాహా చేశారు. దీనికి తోడు అధికార పార్టీ నేతల సిఫార్సులు వినియోగించారు. బ్యాంకు మేనేజరుపై ఒత్తిడి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకున్నారు. ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావడంతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘బీమా సొమ్ము.. స్నేహితులే కాజేశారు..!’ అనే శీర్షికన అర్హులకు అందాల్సిన పరిహారం సొమ్మును ఇతర వ్యక్తులు కాజేసిన విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బీమా సొమ్ము స్వాహాలో పాత్రధారులు ఏజెంటు.. ఇతర వ్యక్తులు కాగా.. సూత్రధారులు మాత్రం అధికార పార్టీ నేతలేనని తెలిసింది. వారి అండదండలతో బ్యాంకు నుంచి సొమ్ము మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వీయ సంతకం చేసిన చెక్‌ (సెల్ఫ్‌ చెక్కు)పై రూ.20 లక్షల నగదు ఒకేసారి డ్రా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఫోర్జరీ సంతకాలతో పాటు.. బ్యాంకు మేనేజరు పాత్రపైనా విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

పక్కా ప్రణాళికతోనే..

పక్కా ప్రణాళికతోనే బీమా ఏజెంట్‌ స్కెచ్‌ వేసి పరిహారం సొమ్ముకు ఎసరు పెట్టారు. విజయవాడ నగరానికి చెందిన పుప్పాల చిరంజీవికి బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి ఉంది. ఇది తెలిసిన ఓ ఏజెంటు.. చిరంజీవితో ఒక ప్రైవేటు బీమా కంపెనీలో 2022 జూన్‌లో జీవిత బీమా రూ.50లక్షలకు చేయించారు. 2022 అక్టోబరులో చిరంజీవి చనిపోయారు. వైద్య పరీక్షలు ఇతరత్రా అన్నీ మేనేజ్‌ చేసినట్లు తెలిసింది. మరణానంతరం బీమా పరిహారం రూ.50లక్షలు మంజూరైంది. నామినీగా ఉన్న చిరంజీవి తల్లి వెంకటగౌరికి మంజూరైంది. ఏజెంటు మహేష్‌ రంగంలోకి దిగి వెంకటగౌరికి బ్యాంకు ఖాతా యూనియన్‌ బ్యాంకులో ఉన్నప్పటికీ దాన్ని కాదని.. జిల్లా సహకార బ్యాంకు గవర్నర్‌పేట బ్రాంచ్‌లో ఖాతా తెరిపించారు. బీమా పరిహారం ఆ ఖాతాలో పడే విధంగా చేశారు. అక్కడ మేనేజర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న మహేష్‌.. చిరంజీవి తల్లి గౌరిని ఏమార్చి చెక్‌లను సమర్పించి 2022 డిసెంబరు 28న రూ.20లక్షల నగదు ఖాతా నుంచి తీసుకున్నారు. తర్వాత మరో రూ.30లక్షలు మరో ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. గౌరి కూతురు నందినికి అనుమానం వచ్చి బీమా సొమ్ము రాలేదని ఆరా తీయగా బ్యాంకులో సొమ్ము లేదని తెలిసింది. ఈ పరిహారం స్వాహాలో పలు అక్రమాలు జరిగాయి. నిబంధనల ప్రకారం సెల్ఫ్‌ చెక్‌పై రూ.20లక్షల నగదు ఇవ్వరు. కానీ తెలిసిన వ్యక్తులే అంటూ బ్యాంకు మేనేజరు రాంబాబు సెలవివ్వడంతో సిబ్బంది ఇచ్చారని తెలిసింది. ఏజెంటుకు,  నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధికార పార్టీ నేత ఒకరు, ఓ ప్రజాప్రతినిధి, మరో నేత బ్యాంకు మేనేజరుకు సిఫార్సు చేయడంతోనే నగదు ఇచ్చినట్లు తెలిసింది. అంతకుముందు ఏజెంటు, మేనేజరు కలిసి పలువురు ఖాతాదారుల నుంచి బలవంతంగా బీమా చేయించినట్లు తెలిసింది. ఆ సంబంధాలతో సొమ్ము ఇచ్చినట్లు సమాచారం. దీనిపై గత నెల స్పందనలో బాధితురాలు గౌరి ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు. ఏసీపీకి మరోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు అధికార పార్టీ పెద్దలు ఆమెను పంచాయితీకి పిలిచినట్లు తెలిసింది. విషయం వెలుగుచూసిన తర్వాత ఏజెంటు ఆమెకు జవవరి 1న రూ.10 లక్షలు నగదు ఒకసారి, మరో రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాకు జనవరి 9న బదిలీ చేశారు. మిగిలిన రూ.20 లక్షలు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

ఇలాంటివి ఎన్నో..

సంబంధం లేని వ్యక్తికి రూ.20లక్షల నగదు ఇవ్వడం సాధారణ విషయం కాదని పోలీసులు సైతం బ్యాంకు మేనేజర్‌ పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ బీమా చేయించిన తీరుపై ఆ ప్రైవేటు సంస్థ ఆరా తీస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు, నయం కాని జబ్బులు ఉన్న వారికి బీమా తిరస్కరిస్తారు. కానీ ఏజెంటు చేసిన పాలసీలపై తిరిగి విచారణ చేయించేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. 

మేనేజరును రక్షించేందుకే..

అసలు ఖాతాదారు బ్యాంకుకు రాకుండానే ఖాతా తెరవడమే కాకుండా ఆమె చరవాణి నెంబరు కాకుండో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చరవాణి అనుసంధానం చేసి సందేశాలు రాకుండా పక్కా ప్రణాళికతో చేయడంలో బ్యాంకు మేనేజరు పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయనను కాపాడేందుకు కొందరు నేతలు పోలీసు దర్యాప్తునకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు కాకుండా దాదాపు నెల రోజులు వాయిదా వేయించిన నేతలు.. ఇప్పుడు పంచాయితీ పేరుతో సెటిల్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని