logo

నా కొడుకు ఎక్కడ?

తన కొడుకు ఎక్కడున్నాడో తెలియజేయాలంటూ వృద్ధ దంపతులు పోలీసులను వేడుకున్న ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది.

Published : 30 Mar 2023 03:09 IST

సామాజిక మాధ్యమాల్లో పోస్టుపై ప్రవాసాంధ్రుడి అరెస్టు
పోలీసుల తీరుపై వృద్ధ దంపతుల ఆవేదన

బాధితుడి తల్లిదండ్రులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: తన కొడుకు ఎక్కడున్నాడో తెలియజేయాలంటూ వృద్ధ దంపతులు పోలీసులను వేడుకున్న ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక రాయ్‌నగర్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు పొందూరి కోటిరత్నం అంజన్‌ అమెరికాలో పీజీ, ఉద్యోగం చేసి ఇటీవల స్వదేశానికి చేరుకొని ఇంటిలోనే ఖాళీగా ఉంటున్నాడు. బుధవారం తెల్లవారు జామున సుమారు 6 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా సర్కార్‌కు వ్యతిరేకంగా అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నాడని తమకు ఫిర్యాదు అందిందని సుమారు పది మంది పోలీసులు.. అంజన్‌ ఇంటిలోకి ప్రవేశించారు. తల్లి రత్నకుమారిని.. కుమారుడు అంజన్‌ ఇంటిలో ఉన్నాడా? అంటూ వీఆర్వో రకీబ్‌, వీఆర్‌ఏ రామకృష్ణలతో కలిసి ఎస్సైలు రమేష్‌, శ్రీనివాస్‌ మరికొంతమంది పోలీసులు మఫ్టీలో ఇంటిలోకి చొచ్చుకెళ్లారు. నిద్రిస్తున్న అంజన్‌ను లాక్కెళ్లిన పోలీసులు.. అతడి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, బ్యాంకు ఖాతా పుస్తకాలు, తల్లి సెల్‌ఫోన్‌ను సైతం  లాక్కెళ్లారు. కనీసం ఎక్కడికో కూడా చెప్పకుండా కుమారుడ్ని తీసుకెళ్లడంపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత గన్నవరం.. అక్కడి నుంచి ఉంగుటూరు స్టేషన్‌కు అంజన్‌ను తరలించిన పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడి నుంచి ఎస్సై శ్రీనివాస్‌ తీసుకెళ్లినట్లు స్టేషన్‌ సిబ్బంది తెలిపారు. రాత్రి 10.30 గంటలు దాటినా కుమారుడు ఎక్కడున్నాడో తెలియకపోవడం, స్టేషన్‌కు వెళ్లినా తాము ఇప్పుడే విధులకు వచ్చామని పోలీసులు సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మధ్నాహ్న సమయంలో ఓ కానిస్టేబుల్‌ ఇంటికి వచ్చి అంజన్‌ సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ ఇవ్వాలని రెండు పర్యాయాలు వచ్చినట్లు అతడి తల్లి తెలిపింది. పోస్టు పెడితే దౌర్జన్యంగా ఇంటిపైకి పోలీసులు మఫ్టీలో రావడమేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడికి ఏమి జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా వైకాపా, తెదేపా పోల్స్‌కు సంబంధించిన పోస్టును అంజన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దానిపై గన్నవరం శ్రీనగర్‌కు చెందిన ప్రతాప్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ఎటువంటి వివరాలను వెల్లడించని పోలీసులపై తెదేపా శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.

కోటిరత్నం అంజన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని