logo

గణాంకాల్లో ఘనం.. ఆచరణల్లో దూరం

సాగుదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వార్షిక ప్రణాళిక అమలు చేస్తోంది.

Published : 29 May 2023 05:31 IST

రుణ ప్రణాళికలో కౌలు రైతులకు అన్యాయం

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే : సాగుదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వార్షిక ప్రణాళిక అమలు చేస్తోంది. సాగు చేస్తున్న వారికే ఇవ్వాల్సిన రుణాలు గణాంకాల పరంగా ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు అందుకు విరుద్ధంగా ఉంటోంది.  పంట  రుణాలు వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదారులకు ఇవ్వాల్సి ఉండగా కేవలం పదిశాతం కూడా దక్కే పరిస్థితి లేదు.ఖరీఫ్‌, రబీ సీజన్‌కు ప్రతిపాదించిన రుణ ప్రణాళికలో వీరికి సంబంధించి ఎటువంటి కేటాయింపు లక్ష్యాలు లేకపోవడం విమర్శకు తావిస్తోంది.  

జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుంటాయి. ఇందులో రమారమి ఎనభైశాతం మేర కౌలురైతులే సాగు చేస్తుంటారు.  కౌలుదారులు సాగు కోసం అధిక వడ్డీలకు అప్పులు తేవడం పరిపాటిగా ఉంటోంది. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, వాతావరణ అననుకూల పరిస్థితులు వంటి కారణాలతో తరచూ రైతులు ఆర్థికంగా నష్టపోక తప్పడం లేదు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెపుతున్నా ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అధికవడ్డీల అప్పుల ఊబిలో పడిపోతున్నామంటూ ఆక్రోశిస్తున్నారు. మరో పక్క ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం సంభవించినప్పుడు వచ్చే పరిహారం వంటి ప్రయోజనాలు పలు ప్రాంతాల్లో భూ యజమానులే దక్కించుకుంటున్నారు. పెరిగిపోతున్న సాగు వ్యయానికి అనుగుణంగా పెట్టుబడి కోసం అవస్థలు పడలేక గత ఏడాది చాలా గ్రామాల్లో కౌలుకు తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇదే పరిస్థితి మరో రెండు మూడు సంవత్సరాలు కొనసాగితే దూర ప్రాంతాల్లో ఉండే భూయజమానులు సాగు చేయలేక కౌలుదారులు ముందుకు రాక క్రాప్‌హాలిడే పాటించే దుస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు.  

ఎవరికిస్తున్నారో స్పష్టత లేదు..

వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాలు, వ్యవసాయ సంబంధిత టర్మ్‌, ఆక్వా రుణాలు ప్రతిపాదిస్తారు. ఇందులో కౌలురైతులకు ఉపయోగపడేవి కేవలం పంట రుణాలు మాత్రమే. ప్రతి ఏడాది ఎన్ని కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు... అందులో కౌలు రైతులకు ఎంత మందికి ప్రయోజనం కల్పించారన్న విషయంపై వాస్తవిక స్పష్టత ఉండటం లేదు. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో కౌలురైతులకు రూ.1000 కోట్లు రుణ లక్ష్యంగా ఉండగా దాదాపు రూ.300 కోట్లు ఇచ్చినట్టు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 80 శాతానికి పైగా కౌలుదారులే సాగు చేస్తుండగా మిగిలిన రూ.700 కోట్లు ఎవరికి పెట్టుబడి రుణంగా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది. సాగు రుణాల్లో అత్యధిశాతం మేర సాగు చేయకున్నా భూయజమానులే దక్కించుకుంటూ కౌలుదారుల ప్రయోజనాలు హరించివేస్తున్నారు.

సీసీఆర్‌సీ కార్డులు ఎంత మందికో?

వరి పంటకు ఎకరానికి రూ.41 వేలు రుణలక్ష్యం(స్కేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌గా)గా నిర్ధారించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి అదనంగా ఒక శాతం రుణాలు ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నా కౌలుదారులకు దక్కింది నామమాత్రమే. మొత్తం 50,000 మందికి పైగా సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చినా రుణ రూపేణా ఇచ్చింది కేవలం రూ.40.37 కోట్లు మాత్రమే. వార్షిక రుణ ప్రణాళికలో 10 శాతం కౌలుదారులకు ఇచ్చే కేటాయింపును గడచిన మూడు సంవత్సరాలుగా చూపడం లేదు. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది కౌలురైతులున్నారు. 2023-24 సంవత్సరానికి 52,570 మందికి పంట హక్కు ధ్రువీకరణ(సీసీఆర్‌సీ) పత్రాలు ఇవ్వాలన్న లక్ష్యం నిర్ణయించారు. ఈ ఏడాది రూ.3,605 కోట్లు పంట రుణ లక్ష్యంగా నిర్ధారించినా కౌలు రైతులకు రుణాల కేటాయింపుపై ఎటువంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఎంతమందికి సీసీఆర్‌సీ కార్డులు ఇస్తారు.. వారిలో ఎంత మంది రుణసౌలభ్యం దక్కుతుందో తెలియదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని