logo

‘బ్రిజ్‌భూషణ్‌ను బర్తరఫ్‌ చేయాలి’

భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని, ఎంపీ సభ్యత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Published : 02 Jun 2023 04:14 IST

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని, ఎంపీ సభ్యత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ.. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, అప్పటి మంత్రి, డబ్ల్యూఎఫ్‌ఐ కోచ్‌ల వేధింపులపై మహిళా రెజ్లర్ల చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించాల్సిన భాజపా.. పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి, దేశానికి ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లకు భాజపా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వేధింపుల ఘటనపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లు నిరసన తెలుపుతామంటే.. పోలీసులు అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుమాలినవని పేర్కొన్నారు. ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ... దేశానికి కీర్తి తెచ్చిన మహిళా రెజ్లర్లకు కేంద్రం అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై దాడులు చేసే అంశంలో వేగంగా స్పందించే భాజపా.. రెజ్లర్ల విషయంలో ఒక్క శాతమైనా శ్రద్ధచూపితే వారికి న్యాయం జరిగేదని పేర్కొన్నారు. వివిధ మహిళా సంఘాలు, యువత, రైతు సంఘాలు, ప్రజా సంఘాల నుంచి సంతకాల సేకరణ చేసి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని నేతలు పేర్కొన్నారు. అనంతరం బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని రాష్ట్రపతిని కోరుతూ నాయకులు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వి.ఉమామహేశ్వరరావు, అక్కినేని వనజ, కె.వి.వి.ప్రసాద్‌, రావులపల్లి రవీంద్రనాథ్‌, కేశవరావు, కొలనుకొండ శివాజీ, సుందరరామరాజు, డి.రమాదేవి, పి.దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని