logo

Machilipatnam: డాక్టర్‌ రాధ హత్య కేసు: అతడేనని తెలుసు... అయినా తాత్సారం!

మచిలీపట్నం నగరంలో సంచలనం రేపిన వైద్యురాలు మాచర్ల రాధ హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చింది.

Updated : 11 Aug 2023 09:40 IST

వైద్యురాలు రాధ

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: మచిలీపట్నం నగరంలో సంచలనం రేపిన వైద్యురాలు మాచర్ల రాధ హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చింది. అయితే... హంతకులు ఎవరనే విషయంలో బలమైన ఆధారాలు లభ్యమైనా రెండు వారాలుగా దర్యాప్తు కొనసాగుతూనే ఉండడం చర్చనీయాంశం అవుతోంది. కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వైద్యురాలి భర్తను కాపాడేందుకు ఒక బలమైన వర్గం చేస్తున్న లాబీయింగ్‌ను బట్టి పథకం ప్రకారమే ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

ప్రాణాలు బలిగొన్న ఆర్థిక అంశాలు: మిస్టరీగా మారిన కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే... మాచర్ల రాధ, ఆమె భర్త ఉమామహేశ్వరరావు పిల్లల వైద్యనిపుణులుగా పేరొందారు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ఉమామహేశ్వరరావు తన ప్రాక్టీస్‌ ద్వారా బాగానే ఆస్తులు సంపాదించారు. రాధ కుటుంబం స్వతహాగా మంచి స్థితిపరులు. కొద్దికాలం కిందట పుట్టింటి నుంచి పెద్ద మొత్తంలో నగదు ఆమెకు సంక్రమించినట్లు సమాచారం. ఆమె వ్యక్తిగత సంపాదనకు తోడు పుట్టింటి నుంచి సంక్రమించిన రూ. కోట్ల ఆస్తిని ధార్మిక, సేవా కార్యక్రమాలకు ఇచ్చేయాలనే నిర్ణయమే ఆమె ప్రాణాలు బలిగొందనే చర్చసాగుతోంది. కుటుంబపరంగా, వ్యక్తిగతంగా ఎవరితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోయినా, కొన్ని నెలలుగా ప్రాక్టీసు వదిలేసి ఇంటికే పరిమితమైన రాధ దారుణంగా హత్యకావడం వెనుక ఆర్థిక అంశాలు మినహా ఇతర కారణాలు లేవని ఆమె బంధువర్గం స్పష్టం చేసింది. హత్యానంతరం తన భార్య ఒంటిపై నగలు అపహరించారని ఉమామహేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

కీలక ఆధారాలు లభ్యం...కేసు దర్యాప్తులో భాగంగా ఉమామహేశ్వరరావు, ఆయనకు నమ్మినబంటుగా ఉండే కారు డ్రైవర్‌, ఆస్పత్రి సిబ్బంది, ఇతర అనుమానితులను విచారించారు.   డ్రైవర్‌ కారం కొనుగోలు చేసిన సూపర్‌ మార్కెట్‌లో సీసీ కెమెరాల్లోని దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కొన్న కారాన్ని సంఘటనా స్థలంలో చల్లినట్లు గుర్తించారు. పోలీసు జాగిలాలను తప్పుదారి పట్టించేందుకు ఇలా చేసినట్లు తేలింది. హత్యచేసి దోచుకుపోయారని చెబుతున్న నగలు అతని వద్ద స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

బలమైన లాబీయింగ్‌.. కేసు దర్యాప్తునకు వేసిన ప్రత్యేక అధికారులు హత్యతో ప్రమేయమున్న వారిని రెండు రోజుల వ్యవధిలోనే గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. దర్యాప్తులో భాగంగా ఉమామహేశ్వరరావు ఇంటరాగేషన్‌ ఎదుర్కోవాల్సిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగర వైద్యులతో అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ల్యాబ్‌ నిర్వాహకుడు, ఉమామహేశ్వరరావుతో స్నేహంగా ఉండే రియల్‌ వ్యాపారులు బలమైన లాబీయింగ్‌తో రంగంలోకి దిగారు. హత్య జరిగిన మరుసటి రోజే కేసును పక్కదారి పట్టించేలా నగరంలో చెడ్డీగ్యాంగ్‌ అని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయించడం వెనుక వీరి హస్తం ఉందన్న ప్రచారం ఉంది. ఉమామహేశ్వరరావుపై శారీరక, మానసిక ఒత్తిడి లేకుండా చేయడానికి ఇప్పటికే రూ. కోటికి పైగా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. దర్యాప్తు సమయంలో ఆస్పత్రిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కారు డ్రైవర్‌ ఒకదానితో ఒకటి పొంతన లేకుండా మూడు రకాలుగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల వెనుక వారి హస్తం ఉన్నట్టుగా సమాచారం. లభ్యమైన ఆధారాలతో కేసుకు ముగింపు పలకడంలో జరుగుతున్న జాప్యం వెనుక ఏదైనా లాబీయింగ్‌ పనిచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు నెలల ముందే ప్రణాళిక... డాక్టర్‌ రాధ హత్య కేసులో ఉమామహేశ్వరరావు నిందితుడని పోలీసుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. హత్యకు మూడు నెలల కిందటే స్కెచ్‌ వేసి.. దీనికి డ్రైవర్‌తో ప్రణాళికను పంచుకున్నట్లు తెలిసింది. భారీగా సొమ్ము ఇస్తానని ఆశ చూపినట్లు సమాచారం. అవకాశం కోసం ఎదురుచూసి, కుమారుడు ఇంట్లో లేని సమయంలో పథకాన్ని అమలు చేశారు. రాధ తలపై ఇనుప వస్తువుతో మోదినట్లు తేలింది. పెనుగులాటలో ఆమె చేతిలో ఉమామహేశ్వరరావు తల వెంట్రుకలు చిక్కుకుపోయాయి. వీటిని పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా అతడివే అని నిర్ధారణ అయింది. ఇప్పటికే నిందితులు వాడిన వస్తువులు, ఆమె ఒంటిపై ఆభరణాలు పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. తొలుత ఉమామహేశ్వరరావు, డ్రైవర్‌.. నోరు విప్పలేదు. గట్టిగా ప్రశ్నించే సరికి ఇంటరాగేషన్‌లో అన్నీ వెల్లడించినట్లు తెలిసింది. విచారణ పూర్తయ్యాక.. నేడో, రేపో ప్రెస్‌మీట్‌ పెట్టి నిందితుల అరెస్టు చూపే వీలుంది.

వెలుగుచూసిన మనస్పర్థలు

సంఘటనా స్థలంలో ప్రాథమికంగా లభించిన ఆధారాలు ఇంట్లో వ్యక్తులనే అనుమానించేలా ఉన్నాయి. వైద్యురాలిని ఆమెకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు, ఆస్పత్రితో సంబంధం ఉన్న వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు హత్య చేసేందుకు అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాప్రదేశంలో సేకరించిన ఆధారాల మేరకు కూడా అపరిచిత వ్యక్తుల ఆనవాళ్లు కన్పించలేదు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉండాల్సిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయకపోవడం కూడా పథకంలో భాగమే అనే అనుమానాలకు తావిచ్చింది. హత్య జరిగిన రోజు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలో అనుమానిత వ్యక్తుల కదలికలు కన్పించలేదు. కొన్నేళ్ల కిందట ఆర్థికపరంగా తన భార్య రాధ వేధింపులకు గురిచేస్తోందని ఉమామహేశ్వరరావు ఆమెపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టి చూస్తే భార్యాభర్తల నడుమ ఆర్థికపరమైన అంశాల వల్ల భేదాభిప్రాయాలున్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు