logo

రసబరితం..!

‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది.

Updated : 30 Apr 2024 06:55 IST

కృష్ణా జిల్లాలో 94 మంది పోటీ
ఎన్టీఆర్‌ జిల్లాలో 113 మంది...
పూర్తయిన నామపత్రాల ఘట్టం

ఈనాడు, అమరావతి: ‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. ప్రచార పర్వానికి తెరలేచింది. ఎండ వేడిమితో ప్రచారఘట్టం వేడెక్కింది. మరోవైపు ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుల్లోనూ కొంత గందరగోళం నెలకొంది. జనసేన గుర్తు... గాజుగ్లాసును స్వతంత్రులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో గాజుగ్లాసును పోలిన పెన్‌స్టాండ్‌ను కేటాయించడంపై జనసేన అభ్యంతరం తెలుపుతోంది. గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్రులకు గాజుగ్లాసు కేటాయించారు. జనసేన అభ్యర్థులకూ ఇదే గుర్తు కేటాయించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా కూటమి, అధికార వైకాపా మధ్య పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు.’’

ఆద్యంతం.. ఆసక్తికరం

విజయవాడ సెంట్రల్‌లో ఎక్కువగా 20 మంది.. అత్యల్పంగా 9 మంది నందిగామలో పోటీ పడుతున్నారు. 14 మంది కంటే ఎక్కువ మంది ఉంటే రెండు వీవీప్యాట్‌లు ఏర్పాటు చేస్తారు. ఒక వీవీప్యాట్‌లో మొత్తం 15 బటన్‌లు ఉంటాయి. 14 మంది అభ్యర్థులు.. ఒక నోటా బటన్‌ ఉంటుంది. సెంట్రల్‌లో నోటాతో కలిపి 21 బటన్‌లు వీవీప్యాట్‌లో ఉంచాలి. ఒకదానిలో 15 మంది, మరో దానిలో అయిదుగురు అభ్యర్థులు, చివరన నోటా బటన్‌ ఏర్పాటు చేస్తారు. విజయవాడ లోక్‌సభ పరిధిలో 17 మంది ఉన్నందున ఇక్కడ రెండు వీవీప్యాట్‌లు పెట్టాలి. విజయవాడ మధ్య, పశ్చిమకూ రెండేసి వీవీప్యాట్‌లు ఏర్పాటు చేయాలి. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం ఓటర్లు.... 17,04,077. శి మచిలీపట్నం పార్లమెంటుకు అత్యధికంగా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్లమెంటుకు రెండు వీవీప్యాట్‌లు వినియోగించాలి. కృష్ణా జిల్లాలో 15.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

నువ్వా నేనా..!

విజయవాడ లోక్‌సభ పరిధిలో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. తాజా ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ వైకాపా నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెదేపా కూటమి నుంచి బరిలో నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థి భార్గవ్‌ కూడా వీరి బంధువే కావడం మరింత ఆసక్తికరం. విజయవాడ లోక్‌సభలో గత రెండు పర్యాయాలు తెదేపా జెండా ఎగరేసింది. ప్రస్తుతం తెదేపా నుంచి జంప్‌ అయిన కేశినేని నాని వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ అభ్యర్థులతో సమన్వయం లోపం ఉన్నట్లు వైకాపా వర్గాలే పేర్కొంటున్నాయి.

ఇదేంది గురూ...

ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఈ గుర్తును జనసేన పోటీలో లేని ప్రాంతాల్లో ఇతర వ్యక్తులకు కేటాయించింది. ఇది కొంత గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బందరు ఎంపీ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఆయనకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. పార్లమెంటుకు పోటీపడే వారికి ఇతరులకు ఈ గుర్తు కేటాయించరు. కానీ పెన్నుస్టాండు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్‌ రంగంలో ఉన్నారు. బందరు అసెంబ్లీ సెగ్మెంటులో చింతపల్లి మనోహర్‌కు, పామర్రులో ఎం.రాజమనోహర్‌, గన్నవరంలో వల్లభనేని వంశీకృష్ణలకు గాజుగ్లాసు కేటాయించారు. పెడన, గుడివాడ, పెనమలూరుల్లో ఎవరికీ గాజుగ్లాసు కేటాయించలేదు. విజయవాడ పార్లమెంటులో వై.కృష్ణకిశోర్‌ అనే స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు కేటాయించారు. విజయవాడ తూర్పు నుంచి కూనపరెడ్డి దశరథ్‌, సెంట్రల్‌లో గొల్లపల్లి ఫణిరాజ్‌, మైలవరంలో వల్లభనేని నాగపవన్‌కుమార్‌, జగ్గయ్యపేటలో బేరోతుల ప్రకాశరావులకు గాజగ్లాసు గుర్తు కేటాయించారు. నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమలో ఎవరికీ కేటాయించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని