logo

వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం

అజిత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 30 Apr 2024 06:46 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నందమూరినగర్‌లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌లో 24 కూపన్లు ఉన్న 5,250 షీట్ల అంశంపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానిని విచారించారు. నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కూపన్లకు ఆర్డర్‌ ఇచ్చాడని వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాసరావు చరవాణికి ఫోన్‌ చేస్తే అది స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దాని పూర్తి వివరాలు కూపీ లాగుతున్నారు.

  కుక్కర్ల కోసం వేట  : వైకాపా ఎన్నికల గుర్తుతో ఉన్న 1.26 లక్షల కూపన్లు దొరకడం విజయవాడలో కలకలం సృష్టించింది. ఓడిపోతున్నామనే భయంతోనే వైకాపా ప్రజలను ప్రలోభపెట్టేందుకు కుక్కర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుందని సర్వత్రా వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం దీన్ని విమర్శిస్తున్నారు. ఇది నిజంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అని పేర్కొంటున్నాయి. కాగా 1.26లక్షల కూపన్లు పట్టుబడటంతో నగరంలో ఎక్కడో ఒక చోట కుక్కర్లు పెద్ద మొత్తంలో నిల్వ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న గోదాంలపై అధికారులు నిఘా పెట్టారు. ప్రధానంగా ఊరికి చివరగా పొలాల్లో బాణసంచా నిల్వ ఉంచేందుకు కొన్ని ప్రాంతాల్లో గోదాంలు ఉన్నాయని, అలాంటి చోట దాచి ఉంచే అవకాశం ఉందని కొంత మంది వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు దీనిపై దృష్టి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని