logo

నాలుగేళ్లుగా నాన్చుడే పని

Published : 30 Apr 2024 06:43 IST

శంకుస్థాపన దగ్గరే ఆగిన నిర్మాణం
గుడివాడలో శిథిలమైన బస్టాండ్‌ ప్రాంగణం

గుడివాడ ఆర్టీసీ బస్టాండు

 గుడివాడ ఆర్టీసీ బస్టాండును ఆధునికీకరిస్తా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరు పెట్టి.. ఆయన చేతులమీదుగానే ఘనంగా ప్రారంభోత్సవం చేస్తాం.

- ఎమ్మెల్యే కొడాలి నాని కొన్నేళ్ల కిందట చెప్పిన మాటలివి..


ఈనాడు, అమరావతి

ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మూడో పెద్ద మున్సిపాలిటీ గుడివాడ. జిల్లాలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి గుడివాడకు వేలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. విజయవాడ, ఏలూరు, నూజివీడు, మచిలీపట్నం లాంటి నగర, పట్టణాలకు మధ్యలో ఉండే ప్రాంతం. కానీ.. గుడివాడకు వెళ్లే రహదారులు ఎంత దారుణంగా ఉంటాయో.. అంతకంటే దయనీయంగా ఆర్టీసీ బస్టాండ్‌ ఉంది. బస్టాండ్‌ రూపురేఖలనే మార్చేస్తా, జగన్‌ పేరు పెడతా.. అంటూ గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే కొడాలి నాని.. ఐదేళ్ల పదవీకాలం కూడా త్వరలో ముగుస్తోంది. కానీ.. బస్టాండ్‌ అభివృద్ధికి కనీసం పునాది రాయి కూడా ఇంతవరకు వేయలేదు. నిర్మాణం చేపడతామంటూ వేసిన శిలాఫలకం కూడా శిథిలమైయింది. కానీ.. రెండేళ్లయినా.. బస్టాండ్‌ పనులు మాత్రం ఆరంభం కాలేదు. కొడాలి నాని మాటలకు.. చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతనేది.. గుడివాడ బస్టాండ్‌ను చూస్తే.. అర్థమవుతోంది.

ఒక్క ఇటుకా వేయలేదు..

గుడివాడ బస్టాండ్‌, డిపో ఆధునీకరణ పనులను రూ.21.31 కోట్లతో చేపడతామంటూ.. 2021 జులై 02న ఘనంగా శంకుస్థాపన చేశారు. అప్పటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ను తీసుకొచ్చి మరీ భూమి పూజ చేయించారు. ఈ నిధుల్లో కొంత వెచ్చించి.. డిపో నిర్మాణం మాత్రమే చేపట్టారు. కానీ.. నిత్యం ప్రయాణికులకు అవసరమైన బస్టాండ్‌ను మాత్రం గాలికొదిలేశారు. పేర్ని నాని వచ్చి వెళ్లిన తర్వాత.. ఈ మూడేళ్లలో కనీసం ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా వేసింది లేదు. రోజూ వందల బస్సులు గుడివాడకు వచ్చి వెళుతుంటాయి. వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి బస్టాండ్‌ ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. చిన్న వర్షం పడితే చాలు.. బస్టాండు పూర్తిగా నీటిలో మునిగిపోతుంది.

శిథిలమైన భవనాలు..

గుడివాడ బస్టాండు భవనాలు పూర్తిగా శిథిలమైపోయాయి. విజయవాడ నుంచి వచ్చే నాన్‌స్టాప్‌ బస్సులు ఆగే భవనం పూర్తిగా పెచ్చులూడిపోయి.. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ప్రయాణికులు నిలబడి ఉంటే.. పైనుంచి పెచ్చులు రాలి పడుతున్నాయి. అలాంటి దాంట్లోనే నిత్యం వందల మంది ప్రయాణికులు కూర్చుని బస్సుల కోసం వేచి చూస్తుంటారు. పైకప్పు కూలడం లాంటి ప్రమాదాలు జరిగితే.. ప్రాణనష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ శిథిల భవనాన్ని చూసి ప్రయాణికులు చాలామంది లోపలికి రాకుండా.. బయట ఎండలోనే నిలబడుతుంటారు.


ఎన్నాళ్లు నిర్మిస్తారు?

ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మించడానికి ఎంతకాలం పడుతుంది. నా జీవితంలో ఎన్నడూ ఇలాంటి విచిత్రం చూడలేదు. ఏళ్లు గడిచిన కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఆ భారం కూడా ప్రజలపైనే పడుతుంది.    

-డి.శ్రీకాంత్‌


ప్రజలు అవస్థలు పడుతున్నారు

ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణ పనులు జరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు బస్టాండ్‌లో నానా అవస్థలు పడుతున్నారు. తర్వితగతిన  పూర్తి చేస్తే ఇబ్బందులు తప్పుతాయి. 

- కల్యాణ్‌


ఏటా ఖర్చు పెరుగుతోంది

ఏటా ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణ అంచనా వ్యయం పెరుగుతోందే కానీ నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. గుత్తేదారులు నిర్మాణ పనులు నాన్చుడు ధోరణితో చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. తక్షణం ప్రభుత్వం స్పందించి బస్టాండ్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి.

సయ్యద్‌ జబీన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని