logo

కత్తిగట్టారు.. కుట్రపన్నారు!

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి.

Published : 30 Apr 2024 06:33 IST

ఇంటింటికీ వెళ్లి.. ఒక్క రోజులో పింఛను ఇవ్వొచ్చు
బ్యాంకుల చుట్టూ తిప్పి ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టే ఎత్తుగడ
నెపం ప్రతిపక్షాలపై వేయాలనే దురాలోచన
ఈనాడు, అమరావతి

24 గంటల్లో 4.81 లక్షల మందికి

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో దానిలో 11 మంది సిబ్బంది ఉన్నారు. కొన్నిచోట్ల ఒకరిద్దరు తక్కువైనా సగటున 10 మంది చొప్పున 11,130 మంది ఉన్నట్లే. వీరితో పింఛన్లు ఇంటింటికీ వెళ్లి ఇచ్చేలా చేస్తే.. ఒక్కొక్కరూ 43 మందికి పంచితే.. మొత్తంగా 4.81 లక్షల మందికి ఇచ్చేయొచ్చు. అంటే.. ఉదయం ఆరంభిస్తే.. మధ్యాహ్నానికి ఒక పూటలోనే అత్యంత తేలికగా ఇవ్వగలరు.

గత నెల కంటే ఎక్కువ క్షోభ..

బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్ము వేస్తే ఏప్రిల్‌లో వృద్ధులు పడిన మానసిక క్షోభ కంటే ఎక్కువ.. ఈసారి ఎదురుకానుంది. నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరగడం వీరికి ప్రాణసంకటమే. దీనికంటే తమకు దగ్గరలో సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవడమే.. ఉత్తమమని వారే చెబుతున్నారు. పైగా.. అత్యధికులు బ్యాంకు ఖాతాలు చాన్నాళ్లుగా వాడడం లేదు. అందుకే.. సర్కారు సొమ్ము ఖాతాలో పడగానే.. రకరకాల పెండింగ్‌ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోత వేస్తాయి. 42 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఏటీంలను వెతుక్కుంటూ వెళ్లడం వృద్ధుల ప్రాణాలకు ప్రమాదకరమే.

ఏటీఎంలలో నగదు గగనమే...

ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 800 వరకు ఉండగా.. 1,000 దాకా ఏటీఎంలు ఉన్నాయి. 4.81 లక్షల మందిలో కనీసం 4 లక్షల మందికి ఖాతాల్లో వేసినా.. వీళ్లంతా ఏటీంలను వెతుక్కోవాల్సిందే. గ్రామాల్లో అంతటా ఏటీఎంలే లేవు. అక్కడక్కడా ఉన్నా.. వాటిలో ఎప్పుడూ డబ్బు ఉండదు. వెరసి గ్రామీణ వృద్ధులు.. పట్టణాలకు రావాల్సిందే. ఇందుకు ఆటో మాట్లాడుకుని రావడానికి కనీసం రూ.200 అవుతుంది. పైగా.. వృద్ధులు ఒంటరిగా రాలేరు. తోడుగా ఎవరో ఒకరిని తెచ్చుకోవాలి. వీటికితోడు.. ఒకటో తేదీ తర్వాత నుంచి ఐదు వరకు ఎక్కువ మంది ఏటీఎంలలో నుంచి జీతాల డబ్బులు డ్రా చేస్తుంటారు. వాళ్ల రద్దీతో ఏటీఎంలలో డబ్బులు ఎప్పటికప్పుడు అయిపోతాయి.

మీకు తెలుసా?

ఏప్రిల్‌లో రెండు జిల్లాల్లో సచివాలయాల వద్దకు ఏప్రిల్‌ 3న ఉదయాన్నే పింఛనుదారులు చేరుకున్నా.. సాయంత్రం 4 గంటల తర్వాతే పింఛన్ల పంపిణీ ఆరంభించారు. అయినా.. ఆరోజు రాత్రి 8 గంటలకు.. అంటే కేవలం 4 గంటల్లోనే.. ఎన్టీఆర్‌ జిల్లాలో 43 శాతం, కృష్ణాలో 42.50 శాతం పింఛన్లు పంచేశారు. తర్వాత రోజు మధ్యాహ్నానికే 85 శాతం మందికి ఇచ్చేశారు. 

విజయవాడలో..2 గంటలు చాలు

విజయవాడ నగరంలో.. 286 వార్డు సచివాలయాలు ఉన్నాయి. నగరపాలక సంస్థ నుంచి కేటాయించిన అడ్మిన్లు కాక.. ఒక్కోచోట తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. 286 సచివాలయాల్లో 2,574 మంది ఉన్నారు. పింఛనుదారులు 67 వేల మంది ఉన్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో 235 పింఛన్లు మాత్రమే ఉన్నాయి. 2,574 మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్తే ఒక్కొక్కరూ 26 మందికి పింఛన్లు ఇస్తే చాలు. ఉదయం 9 గంటలకు పంపిణీ ఆరంభిస్తే.. 67 వేల మందికీ రెండు మూడు గంటల్లోనే ఇచ్చేయొచ్చు.

మచిలీపట్నంలో ... 3 గంటలు చాలు

బందరు నగరంలో 50 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో దానిలో 10 మంది చొప్పున 500 మంది సిబ్బంది ఉన్నారు. పింఛనుదారులు 19,136 మంది ఉన్నారు. ఒక్కో సచివాలయంలో 383 మంది పింఛనుదారులు ఉన్నారు. 500 మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్తే ఒక్కొక్కరూ 38 మందికి పింఛన్లను అందజేస్తే చాలు. అంటే.. ఉదయం 9 గంటలకు పంపిణీ ఆరంభిస్తే.. మధ్యాహ్నం 12 గంటల్లోపే అందరికీ ఇచ్చేయొచ్చు.

మండలాల్లో  ఒక పూట  చాలు..

కృష్ణాలో 25, ఎన్టీఆర్‌లో 20 మండలాలు ఉండగా.. మొత్తంగా 4.81 లక్షల పింఛనుదారులు ఉన్నారు. ఒక్కో మండలంలో 10-11వేల పింఛనుదారులు ఉన్నారు. ఉదాహరణకు కంకిపాడు మండలంలో 10 వేల మంది పింఛనుదారులు ఉన్నారు. మండలంలో 15 సచివాలయాలు.. ఒక్కోచోట 11 మంది చొప్పున 165 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లు కాక.. 20 పంచాయతీల్లో.. బిల్‌కలెక్టర్లు, అసిస్టెంట్లు ఒక్కో దానిలో ఇద్దరేసి వేసుకున్నా.. కనీసం 40 మంది ఉన్నారు. అంటే.. ఈ 205 మంది ఇంటింటికీ వెళ్లి ఒక్కొక్కరూ 49 మందికి పింఛన్లను ఇస్తే.. అందరికీ ఒక్క పూటలో ఇచ్చేయొచ్చు.

గ్రామాల్లో  అత్యంత  తేలిక..

పెనమలూరు పరిధి పొద్దుటూరులో 470 పింఛన్లున్నాయి. సచివాలయ సిబ్బంది 11 మంది ఉన్నారు. వీళ్లు కాకుండా ఒక గుమస్తా, ఒక సెక్రటరీ అదనం. అంటే.. మొత్తం 13 మంది. వీళ్లలో ముగ్గురు సెలవులో ఉన్నా.. మిగతా పది మంది కలిపి ఒక్కొక్కరు 47 మందికి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను ఇవ్వడానికి.. కేవలం ఒక పూట చాలు.

ఖాతాల్లో వేసి మళ్లీ  శవరాజకీయాలా..

ఏప్రిల్‌లో.. పింఛన్ల మాటున.. వైకాపా నేతలు అత్యంత వికృత క్రీడ ఆడారని అందరికీ తెలుసు. వీరికి కొందరు అధికారులు, సచివాలయ సిబ్బంది సహకరించారు. కానీ.. మే నెల పింఛన్ల పంపిణీలో అంతకంటే దారుణ క్రీడను వృద్ధులు, దివ్యాంగులతో ఆడేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామనడం దారుణం. వృద్ధులను మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేసే ప్రక్రియ ఇది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరిగి.. ఎండలో మాడ్చి, సొమ్మసిల్లిపోయేలా చేసి.. దానిని ప్రతిపక్ష పార్టీలపై నెట్టాలనే పన్నాగంలో భాగమే ఇది. గత నెలలో సచివాలయాలకు వస్తేనే.. కొందరి ప్రాణాల మీదకు వచ్చింది. వారి చావులతోనూ.. శవరాజకీయం చేయాలని పెనమలూరులో జోగి రమేష్‌, మచిలీపట్నంలో పేర్ని కిట్టు వంటి వాళ్లు ప్రయత్నించడం అత్యంత హేయం. వీటిని జనమంతా ఏకమై.. ఛీకొట్టారు.


కంకిపాడు

వడదెబ్బబారిన పడ్డా  

గత నెల మూడో తేదీనే పింఛను సొమ్ము ఇస్తారని వాలంటీర్లు చెప్పినట్లు పరిసరాల లబ్ధిదారులు తెలిపారు. దీంతో ఉదయం 9 గంటలకే సచివాలయానికి వెళ్లా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డబ్బు రాలేదని.. సాయంత్రం ఇస్తామన్నారు. మరోసారి వచ్చా. అప్పటికే పంపిణీ పూర్తయిందని చెప్పడంతో తిరిగి వెళ్లా. వడదెబ్బ బారిన పడ్డా. ఈ నెల అయినా ఇంటి వద్ద ఇస్తే మేలు. 

అన్నపూర్ణ


 ఎదురుమొండి

దూరాభారంతో అవస్థలు

ఎదురుమొండి నుంచి ఫంటు మీద ప్రయాణం చేసి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగాయలంకకు వెళ్లి బ్యాంకులో నగదు తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరం. ఎండలు మండుతున్నాయి. బయటకురాలేని పరిస్థితి. ప్రభుత్వం ఇంటి వద్దకే ఫింఛను అందేలా చర్యలు తీసుకోవాలి.

సైకం నరసింహారావు


తోట్లవల్లూరు

అంత దూరం కష్టం

 నా వయసు 74 సంవత్సరాలు. బ్యాంక్‌ ఖాతాలో డబ్బులేస్తే అంత దూరం వెళ్లి తెచ్చుకోవాలంటే నడవ లేను. ఆటోలో వెళ్లినా వేచి చూడాలి. సచివాలయానికి వెళ్తే ఏంటి? బ్యాంక్‌కు వెళ్తే ఏంటి? ఎక్కడైనా నిరీక్షించాల్సిందే. మా లాంటి వయసు మళ్లిన వారికి అధికారులు ఇంటి వద్దే పింఛను ఇవ్వాలి.

 వడ్డేశ్వరం శిరోమణి


వలివర్తిపాడు 

ఏటీఎం కార్డు లేదు..

నేను బయటకు రాలేను. నా పరిస్థితి గమనించి గత నెలలో వెనిగండ్ల రాము ఆటోలో తీసుకెళ్లగా పింఛను తీసుకున్నాను. నాకు ఏటీఎం కార్డులేదు. ఈ నెల ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇంట్లోవారు పని మానుకొని నన్ను బ్యాంకుకు తీసుకెళ్లాలి. అధికారులు దయదలచి ఇంటివద్దే ఇవ్వాలి. 
 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని