logo

అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు

వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్‌ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు

Published : 30 Apr 2024 06:28 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్‌ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఓ వివాహిత కూలి చేసుకొని జీవిస్తుంటుంది. తమ ఇంటిని శుభ్రపర్చాల్సి ఉందని బెంజిసర్కిల్‌ సమీపంలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే శ్రీను, ఇతని స్నేహితుడు నాగరాజులు ఈమెను 16.12.2022న ఆటోలో ఎక్కించుకొని బయల్దేరారు. మార్గ మధ్యలో నాగరాజు ఆటో దిగి వెళ్లిపోగా రవి అనే మరో వ్యక్తి ఈ ఆటోలో ఎక్కాడు. అనంతరం ఆమెను శ్రీను, రవిలు కానూరు సనత్‌నగర్‌లోని  రవి ఇంటికి వెళ్లారు. రవి ఇంట్లో ఈమె ఇల్లు శుభ్రపరుస్తుండగా కొంతసేపటికి నాగరాజు కూడా అక్కడికి వచ్చాడు. వీరు ముగ్గురూ ఈమెపై వరుసగా మూడ్రోజులు సామూహిక అత్యాచారం చేశారు. ఎదురు తిరిగిన ఈమెను విపరీతంగా కొట్టి సిగరెట్లతో కాల్చి హింసించారు. మూడో రోజు ఈమె అరుపులు విన్న స్థానికులు రక్షించి ఇంటికి పంపగా.. అప్పటికే గాయాలపాలైన బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అఘాయిత్యానికి పాల్పడ్డ అర్డకళ్ల శ్రీనివాస్‌, రవి, కందుకూరి నాగరాజులపై అప్పటి సీఐ గోవిందరాజులు కేసు నమోదు చేశారు. రెండో నిందితుడైన రవి పరారయ్యాడు. తదుపరి వచ్చిన సీఐ టీవీవీ రామారావు ఛార్జిషీటు  దాఖలు చేశారు. కేసు విచారణకు రాగా ఐదో అదనపు జిల్లా కోర్టు, మహిళా సెషన్స్‌ న్యాయాధికారి ఈ కేసులో 13 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో ముద్దాయిలు శ్రీనివాస్‌, నాగరాజులకు పదేళ్ల కఠిన కారాగారశిక్ష, ఒక్కొక్కరికి రూ.3 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని