logo

వైకాపా అరాచకీయం!

‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది.

Updated : 30 Apr 2024 06:58 IST

 వాలంటీర్ల రాజీనామాల వెనుక పెద్ద కుట్రే
 బూత్‌ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని ప్రయత్నాలు
 ఏకంగా ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్న నాయకులు..
 వాళ్లతోనే ఇంటింటికీ కొత్త మ్యానిఫెస్టో ప్రచారం

ఈనాడు, అమరావతి : ‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారికి వైకాపా కొత్త మ్యానిఫెస్టోతోపాటు బూత్‌ ఏజెంటుగా కూర్చోబెట్టాక ఏం చేయాలి? ఎలా చేయాలనే అంశాలపై వైకాపా కార్యాలయంలో తర్ఫీదు ఇచ్చినట్టు తెలిసింది. రాజీనామా చేసిన వాలంటీర్లను ప్రస్తుతం ఇంటింటికీ పంపి పింఛనుదారులు, లబ్ధిదారులను ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. మళ్లీ వైకాపాకే ఓటు వేయాలనీ, అప్పుడే జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని, పింఛన్లతోపాటు అన్ని ప్రభుత్వ పథకాలను తామే ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని.. రాజీనామా చేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చెబుతున్నట్టు తెలుస్తోంది. పోలింగ్‌ రోజు.. బూత్‌లోనే వీళ్లను ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. వచ్చే ఓటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి.. ప్రభావితం చేయాలని నాని వర్గం కుట్ర చేస్తున్నట్టు సమాచారం.’’

ఉమ్మడి జిల్లాలో నెల రోజులకు పైగా..

వాలంటీర్లతో రాజీనామాలు చేయించేందుకు వైకాపా నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొందరు వైకాపా నేతలను దీనికోసమే నియమించి మరీ.. రాజీనామాలు చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. రాజీనామాలు చేసే వారికి రెండు మూడు నెలల జీతాలు ముందే ఇచ్చేసి, తిరిగి అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని.. హామీలు ఇస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో వారితో  బలవంతంగా రాజీనామాలు సైతం చేయించారు. విజయవాడ తూర్పులో కోడ్‌ అమలులో ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా.. పది రోజుల కిందట వాలంటీర్లతో రహస్య సమావేశం పెట్టారు. దేవినేని అవినాష్‌ కీలక అనుచరుడి ఆధ్వర్యంలో రాణిగారితోట ప్రాంతంలోని 17వ డివిజన్‌.. బాపనయ్యనగర్‌లో ఉన్న ఓ పాఠశాలకు సమీపంలో ఈ రహస్య భేటీ ఏర్పాటు చేశారు. రాజీనామా చేసేవాళ్లకి రూ.10వేలు ఇస్తామనీ, చేయని వారికి తమ ప్రభుత్వం మళ్లీ వస్తే.. ఇబ్బందులు తప్పవని బెదిరించి మరీ కొందరు వాలంటీర్లతో సంతకాలు చేయించారు.

ఓటర్లను ప్రభావితం చేయాలనే...

అన్ని నియోజకవర్గాల్లోనూ.. రాజీనామాలు చేయించేందుకు ఒకే రకమైన పంథా అనుసరించడం, వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి పెట్టడం, చేయని వారిపై కక్ష సాధింపులు తప్పవనే హెచ్చరికలు ఇవ్వడం వంటివి.. గత రెండు మూడు వారాలుగా బాగా ఎక్కువయ్యాయి. కేవలం ప్రచారంలో వారిని వాడుకునేందుకే.. ఇలా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారని ఇప్పటివరకూ అంతా అనుకున్నారు. కానీ.. వారితో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా నేతలు పెద్ద ప్లానే రచించినట్టు తాజాగా అర్థమవుతోంది. వారిని ఎన్నికల రోజు పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. ఓటర్లను భారీగా ప్రభావితం చేయాలనేదే అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. వాలంటీర్లతో ఓ ప్రహసనంలా.. బలవంతంగా రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత ఐదేళ్లుగా ఇంటింటికీ తిరిగి పట్టుపెంచుకున్న.. వాలంటీర్లతో ఎన్నికల రోజు ఓటర్లను బాగా ప్రభావితం చేయాలనేది వైకాపా అసలు కుట్ర.

ప్రతిపక్ష పార్టీల ఆందోళన...

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 22,400 మంది వాలంటీర్లు ఉండగా.. వీరిలో రెండు జిల్లాల్లో కలిపి రెండు వేల మంది వరకూ రాజీనామాలు చేశారు. గుడివాడలో ఇప్పటివరకూ 70 మందికి పైగా రాజీనామాలు చేశారు. వీరందరినీ ఎన్నికల్లో బూత్‌ ఏజెంట్లుగా వాడుకోవాలని.. శిక్షణ ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే.. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగడానికి ఆస్కారమే ఉండదనీ.. ప్రతిపక్ష తెదేపా, జనసేన, భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లోనే కూర్చుని.. ఓటర్లను ప్రభావితం చేయడం కంటే దారుణం ఇంకొకటి ఉండదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో రాజీనామా చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.2.50 లక్షలు చొప్పున ఇచ్చి వైకాపా తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. తెదేపా పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎలవర్తి శ్రీనివాసరావు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని