logo

గురువులపై దమనకాండ

జగన్‌ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 30 Apr 2024 06:57 IST

డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయుల ఉద్యమబాట
ఉక్కుపాదం మోపిన వైకాపా ప్రభుత్వం
ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, మాచవరం, న్యూస్‌టుడే

బీఆర్టీఎస్‌ రోడ్డులో ఉపాధ్యాయుల నిరసన (పాత చిత్రం)

గన్‌ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డే ప్రకటించారు. ఇచ్చిన హామీ నెరవేర్చమని తాము అడిగితే.. ఉక్కుపాదం మోపి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేశారని దుయ్యబడుతున్నారు. పీఆర్సీ అమలు, పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నంబరు 117 రద్దు తదితర సమస్యలపై పోరు బాట పట్టారు. గృహాల వద్ద నిర్భందించడం, పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి కూర్చోబెట్టడం, పాఠశాలల వద్ద పోలీసుల పహారాతో తమను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని.. గత అనుభవాలను తలచుకుంటూ.. గురువులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

బైండోవర్‌ల బెడద..

ఉద్యమాల నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసు స్టేషన్లకు తరలించారు. పలు సందర్భాల్లో వారి విడుదలకు రూ.2 లక్షల వరకు పూచీకత్తు కట్టాలని బెదిరింపుల పర్వానికి దిగారు. మరోవైపు బైండోవర్‌ కేసులను బనాయించడానికి వెనుకాడే ప్రసక్తే లేదని సంతకాలు చేయించుకోవంతో.. తాము బిక్కు బిక్కు మంటూ కాలం గడిపిన రోజులను నేడు ఉపాధ్యాయులు గుర్తుకు తెచ్చుకుంటూ గుండెలు బాదుకుంటున్నారు. విజయవాడ కేంద్రంగా జరిగే ఉద్యమాలకు విజయనగరం, విశాఖ, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు ఒకటి రెండు రోజులు ముందుగానే బయల్దేరతారు. ఈక్రమంలో ఇలాంటి నాయకులను ముందస్తుగానే అరెస్టులు చేసి, తమ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేసిందని తూర్పారబడుతున్నారు. తమపై నమోదు చేసిన వివిధ పోలీసు కేసులను ఎత్తి వేస్తామని మంత్రి వర్గ ఉపసంఘం చర్చల్లో హామీ ఇచ్చినా.. సదరు కేసులను ఎత్తివేశారో లేదా అలానే ఉంచారో తెలియని పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తోంది

ప్రశ్నించే గొంతుకను వైకాపా ప్రభుత్వం నొక్కేస్తోంది. మా సమస్యలపై శాంతియుత ఆందోళనలకు దిగితే.. పలు అవాంతరాలు సృష్టించింది. రాజ్యాంగంలోని వాక్‌ స్వాతంత్య్ర హక్కును హరించేలా వ్యవహరిస్తోంది. 

ఓ ఉపాధ్యాయుడు

ఇంతటి అరాచకం ఎప్పుడూ చూడలేదు

ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో మేం ఎప్పుడూ చూడలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 76 ఏళ్లలో పలు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయి. కానీ ఈ అయిదేళ్లలో మాపై సాగిన అరాచకం.. గతంలో ఎప్పుడూ లేదు. ఇది దుర్మార్గపు చర్య. 

ఓ ఉపాధ్యాయుడు

మేం తీవ్రవాదులం కాదు

మే మేమైనా తీవ్రవాదులమా..? అరెస్టులు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడానికి. ప్రతి ఒక్కరికీ వారి వారి వృత్తిని బట్టి వారికి కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని కాలరాయడానికి వైకాపా ప్రభుత్వం ప్రయత్నించింది. మమ్మల్ని ఈ అయిదేళ్లలో తీవ్రంగా వేధింపులకు గురిచేసింది. 

ఓ ఉపాధ్యాయుడు

ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు

ఉద్యోగులకు ఇచ్చిన హామీని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఉపాధ్యాయుల సమస్యలపై శాంతియుతంగా చేపట్టే ధర్నాలకు అనుమతులు ఇవ్వలేదు. గత ప్రభుత్వాల్లోనూ మా సమస్యలపై పోరాడాం. ఆందోళనలు, ధర్నాలు చేశాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు.

ఓ ఉపాధ్యాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని