logo

ఓటమి భయంతో అవినాష్‌ అసత్య ప్రచారం

వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్‌ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్‌ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

Updated : 30 Apr 2024 06:58 IST

తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై వైకాపా వీడియో 

వైకాపా నేతలు విడుదల చేసిన వీడియోలో తెలంగాణ ఆటో గురించి చెబుతున్న పట్టాభిరామ్‌

పటమట (విజయవాడ), న్యూస్‌టుడే : వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్‌ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్‌ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. సోమవారం అశోక్‌నగర్‌లోని తెదేపా తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటూ దేవినేని అవినాష్‌ విడుదల చేసిన ఫేక్‌ వీడియోను ప్రొజెక్టర్‌పై ప్రదర్శించి అందులోని అసత్యాలను ఎండగట్టారు. పట్టాభి మాట్లాడుతూ నిజం చెప్తే అవినాష్‌ తల ముక్కలయ్యే శాపం ఉందని, అందుకే ఆయన ఏనాడూ నిజాలు చెప్పరన్నారు. వీడియోలతో ఫేక్‌ ప్రచారం చేయడం అవినాష్‌ నైజమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేకపోవడంతో తెలంగాణ వెళ్లి వీడియో తీసుకోవాల్సిన దుస్థితికి దిగజారారన్నారు. వైకాపా నేతలను చూన్తే జాలి వేస్తోందన్నారు. గతంలో కూడా ఇలానే రిటైనింగ్‌ వాల్‌ తానే కట్టించానని అవినాష్‌ ప్రచారాలు చేస్తుంటే, తాము ఆధారాలతో సహా వీడియో విడుదల చేసి అవినాష్‌ తీరును ఎండకట్టామన్నారు. వైకాపా పాలనలో నియోజకవర్గంలో రూ.650 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ గద్దె రామ్మోహన్‌ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే నియోజకవర్గంలో 2019-2024 వరకు కేవలం రూ.173 కోట్ల నిధులు కేటాయించగా అందులో రూ.98.9 కోట్ల మేర పనులు జరిగినట్లు ప్రభుత్వ అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారని పేర్కొన్నారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌ ఎల్‌.వి.ప్రసాద్‌ ఆసుపత్రి పక్కన రూ. వందల కోట్ల విలువైన స్థలాన్ని నెహ్రూకి కట్టబెట్టరన్నారు. ఆ స్థలంలో విలువైన కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారని అందుకే హైదరాబాద్‌ అంటే అవినాష్‌కు ఇష్టమన్నారు. వైకాపా పాలనలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, కానీ అవినాష్‌ ఆస్తుల మాత్రం అభివృద్ధి చెందాయన్నారు. 2019, 2024 ఎన్నికల అఫిడివిట్లను చూపించారు. గుణదల దొడ్డిలో సెటిల్‌మ్మెంట్లలో రాయించుకున్న ఆస్తులే ఇందుకు కారణమన్నారు. కొవిడ్‌ సమయంలో గుణదల ముఠా ప్రభుత్వాసుపత్రిలోని ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమిడీసివర్‌ ఇంజక్షన్లు అమ్ముకుని పేద ప్రజల ఉసురు తీసిందన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్‌ చేసిన అభివృద్ధిపై తయారు చేసిన వీడియోలను అంశాల వారీగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, అవినీతి, హత్యా రాజకీయాలపై జగనాసుర రక్త చరిత్ర, అరాచకపాలన అంతం, కూటమి పంతం పేరుతో ఎన్డీఏ కూటమి రూపొందించిన ఛార్జిషీట్‌ కరదీపికను ఆవిష్కరించారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన గద్దె అనూరాధ, భాజపా నేత పోతంశెట్టి నాగేశ్వరరావు, జనసేన నేత అమ్మిశెట్టి వాసు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు