logo

సహకారం లేదాయె!

నామమాత్ర సేవలకే పరిమితమైన సహకార సంఘాలను పునరుత్తేజితం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సొసైటీలే పెట్రో బంకులు నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. అయితే పెట్రో బంకుల ఏర్పాటు మూడడుగులు ముందుకేస్తే.. ఆరడుగులు వెనక్కి

Published : 23 Jan 2022 03:17 IST

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: నామమాత్ర సేవలకే పరిమితమైన సహకార సంఘాలను పునరుత్తేజితం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సొసైటీలే పెట్రో బంకులు నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. అయితే పెట్రో బంకుల ఏర్పాటు మూడడుగులు ముందుకేస్తే.. ఆరడుగులు వెనక్కి తోస్తున్నారు. గతేడాది జులైలోనే పెట్రో బంకులు మంజూరైనా ఇప్పటివరకు నిరభ్యంతర పత్రాల దశ దాటకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వ రంగం నుంచి పనిచేస్తున్న సొసైటీలకే ఎన్‌ఓసీల మంజూరులో వివిధ శాఖల అధికారులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా సహకార సంఘాల సీఈఓలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోతున్నారు. వ్యవసాయ రుణాల లభ్యతకు పునాది అయిన సహకార సంఘాలను పరపతేతర సేవలతో ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోంది.

ఎనిమిది బంకులు మంజూరు

జిల్లాలో సహకార సొసైటీలు 120 వరకు ఉన్నాయి. ఇందులో 105 సొసైటీలు సహకార బ్యాంకుకు అనుబంధంగా నడుస్తున్నాయి. అందులో కూడేరు, యల్లనూరు, పెడబల్లి, ముదిగుబ్బ, కణేకల్లు, రొద్దం, నార్పల, ఆమిద్యాల సొసైటీలకు పెట్రో బంకులు హెచ్‌పీసీఎల్‌ సంస్థ మంజూరు చేసింది. అవసరమైన స్థలం, నిర్వహణ సామర్థ్యం ఉన్న వాటికే కేటాయించారు. పెట్టుబడి ఖర్చులన్నీ హెచ్‌పీసీఎల్‌ భరిస్తుంది. పెట్రోలు, డీజిల్‌ ట్యాంకర్లకు మాత్రమే సొసైటీలు ఖర్చు చేయాలి. అమ్మకం ద్వారా వచ్చిన లాభాలు సొసైటీ ఖాతాకు జమ చేయాలి. దీనివల్ల సొసైటీలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు నాణ్యమైన సేవలు ప్రజలకు అందించడానికి అవకాశం దక్కుతుంది. ఆశయం మంచిదైనా ఏర్పాటులో మాత్రం జాప్యం జరుగుతోంది.

ఎన్‌ఓసీలదే అసలు సమస్య

పెట్రో బంకుల ఏర్పాటుకు పంచాయతీ, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, రహదారి శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు మంజూరు జారీ చేయాలి. ఈ పత్రాలు జారీ అయిన తర్వాత హెచ్‌పీసీఎల్‌ అధికారులు పనులు ప్రారంభిస్తారు. ఆరు నెలలు దాటినా ఒక్క అడుగు పడలేదు. దీనిపై ఏడీసీసీ బ్యాంకు సీఈవో రాంప్రసాద్‌ మాట్లాడుతూ పెట్రోల్‌ బంకుల ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభమయ్యేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఎన్‌ఓసీల జారీ పూర్తయిన వెంటనే సంస్థ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని