logo

అమ్మఒడి.. చిక్కుముడి!

అనంతపురం విద్య, గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: ‘తల్లిదండ్రులూ పిల్లలను బడికి పంపండి.. వారిని చదివించే బాధ్యత మాది. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డను బడికి పంపలేని దుస్థితి రాకూడదు.

Published : 28 Jun 2022 04:50 IST

అర్హులైనా సొమ్ము అందలేదు

పేదలపై చదువుల భారం

నంతపురం విద్య, గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: ‘తల్లిదండ్రులూ పిల్లలను బడికి పంపండి.. వారిని చదివించే బాధ్యత మాది. చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డను బడికి పంపలేని దుస్థితి రాకూడదు. అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందజేస్తాం’ ఇదీ పలు సందర్భాల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాటలు నమ్మి పేదలు కొందరు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. అప్పులు చేసి ఫీజులు చెల్లించారు. ప్రస్తుతం సొమ్ము అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. చిన్నపాటి కారణాలు, సచివాలయ సిబ్బంది చేసిన పొరపాట్లతో అనేక మందికి అమ్మఒడి సొమ్ము అందకుండా పోతోంది.

ఇప్పుడెందుకు ఇవ్వలేదు

పథకం ప్రారంభం నుంచి ఏటా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. కొత్త నిబంధనలతో కోతలే కాదు, అర్హులను పథకానికి దూరం చేస్తున్నారు. సొంతభవనాలు, కార్లు, ఆస్తిపన్ను, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్న కిందిస్థాయి ఉద్యోగులను పథకం నుంచి తొలగించారనుకుంటే ఓ అర్థం ఉంది. నిరుపేదలను సైతం పథకం నుంచి దూరం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో పథకానికి దూరమయ్యారు. ఆధార్‌ అనుసంధానం, ఈకేవైసీ, ఇళ్లులేకపోయినా ఉన్నట్లు చూపడం, విద్యుత్తు బిల్లులు, ఇంటిపన్నులు ఎక్కువగా ఉన్నట్లు నమోదు చేయడంతో అర్హులకు నిధులు అందకుండా పోయాయి. గత రెండేళ్లు సొమ్ము తీసుకున్న పేద తల్లులు చాలామంది ఈసారి అందుకోలేకపోయారు. రెండేళ్లు సొమ్ము ఇచ్చి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రతి సచివాలయంలో జాబితా

ప్రతి సచివాలయం పరిధిలోనూ అమ్మఒడి కోల్పోయిన బాధితులు ఉన్నారు. గత రెండేళ్లు సొమ్ము అందుకున్న వారిలో అనేక మంది ఈ ఏడాది పథకానికి దూరమయ్యారు. లబ్ధిదారుల జాబితా వార్డు/గ్రామ సచివాలయాలకు పంపించారు. అనర్హుల జాబితానూ ప్రదర్శించారు. వాటికి కారణాలు కూడా తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలోనూ 10 నుంచి 50 మంది వరకూ అనర్హులుగా తేల్చారు. అనర్హుల జాబితాలో చాలామంది అర్హులే ఉన్నారు.


తల్లి మల్లికతో విద్యార్థి జశ్వంత్‌

ఈమె పేరు మల్లిక. కుమారుడు జశ్వంత్‌ ఐదో తరగతి పూర్తి చేశాడు. రెండేళ్లు అమ్మఒడి నగదు ఖాతాలో జమైంది. ఈ ఏడాది అందలేదు. సచివాలయంలో అడిగితే మీ ఖాతాకు ఎన్‌పీసీఐ నమోదు కాలేదంటున్నారు. బ్యాంకులో విచారిస్తే.. మరో బ్యాంకు ఖాతాకు నమోదైందని చెప్పారు. వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సాయం వస్తే పిల్లల చదువులకు ఉపయోగపడుతుందని ఆశించారు. న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.


అనంతలోని సాయినగర్‌కు చెందిన ఈమె పేరు అంజినమ్మ. వీధుల్లో తిరుగుతూ పూలవ్యాపారం చేస్తుంది. అమ్మఒడి సొమ్ము వస్తుందన్న ధీమాతో కుమారుడు జశ్వంత్‌సాయిని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. 3వ తరగతి పూర్తయింది. గతేడాది అమ్మఒడి పథకం కింద రూ.14 వేలు అందాయి. ఈ సంవత్సరం అనర్హురాలని పేర్కొన్నారు. ఆమె ఆధార్‌కార్డు నంబరును గతంలో అద్దెకుంటున్న ఇంటికి అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె లేదు. ఆ ఇంటికి, ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా అనర్హురాలిగా ప్రకటించారు. వార్డు సచివాలయంలో నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.


అనంత నగరానికి చెందిన ఈమె పేరు భారతి గృహిణి. భర్త నాగరాజు హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. వారికి ముగ్గురు సంతానం. పెద్దకుమార్తె గిల్డాఫ్‌సర్వీసు పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. 2019, 2020లో అమ్మఒడి పథకం కింద సొమ్ము అందుకుంది. ప్రస్తుతం అనర్హురాలని చెబుతున్నారు. వీరు నాలుగు పోర్షన్ల భవనంలోని ఓ పోర్షనులో  అద్దెకున్నారు. ఇంటి పన్ను ఆమె భర్త పేరుమీదుగా రావడంతో పథకానికి అనర్హులుగా తేల్చారు. ఈ విషయంపై నెలరోజులుగా సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకొనేవారులేరని ఆవేదన వ్యక్తం చేస్తోంది.


రూ.10,500 కోత

నాకు ఇద్దరు కుమారులు. ఓ కుమారుడు విజయవాడలో ఇంటర్‌ చదువుతుండగా.. మరొకరు కొనకొండ్లలోని జ్యోతిరావు ఫులే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తొమ్మిదో తరగతి చదివే కుమారుడికి అమ్మఒడి పథకం ద్వారా సొమ్ము అందాల్సి ఉంది. అయితే ఎస్సీ ప్రీమెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ పేరుతో రూ.10,500 కోత పెట్టారు. రూ.3,500 ఇస్తున్నట్లు జాబితాలో చూపించారు.

- ఆదిలక్ష్మి, దర్గాహొన్నూరు, బొమ్మనహాళ్‌ మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని