logo

నగరం.. జల దిగ్బంధం

ప్రకృతి ప్రకోపం.. మానవాళి తప్పిదంతో అనంతపురంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని నడిమి వంక ఉద్ధృతంగా ప్రవహించింది...

Published : 07 Oct 2022 04:42 IST

దూసుకొచ్చిన వరద

అనంత నగరపాలక, రుద్రంపేట, ఆజాద్‌నగర్‌ : ప్రకృతి ప్రకోపం.. మానవాళి తప్పిదంతో అనంతపురంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని నడిమి వంక ఉద్ధృతంగా ప్రవహించింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉద్ధృతి పెరిగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఊహించని విధంగా వరద రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హంద్రీనీవా నీటితో చెరువులను నింపారు. మరో వైపు వర్షం నీరు తోడవడంతో అనంత గ్రామీణం, రాప్తాడు పరిధిలోని పలు చెరువులు పొంగి పొర్లాయి. నగరం పైభాగాన ఉన్న ఆలమూరు, కక్కలపల్లి, బుక్కచెర్ల, కాటిగాని కాలువ పరిసర ప్రాంతాల్లోని చెక్‌డ్యాములు నిండాయి. నీరంతా ఉన్న ఫళంగా రుద్రంపేట పంచాయతీ పరిధిలోని విశ్వశాంతినగర్‌, సీపీఐ తదితర కాలనీలను జలదిగ్బంధం చేశాయి.

అక్రమ కట్టడాలు.. అడ్డంగా మట్టి!
రుద్రంపేట నుంచి రజకనగర్‌ శివారు వరకు వంకకు అడ్డంగా ఇళ్ల నిర్మాణాలు సాగాయి. ఓ వైపు వరద.. మరో పక్క అక్రమ కట్టడాలతో నీరు ఇళ్లలోకి చేరింది. నగర శివారులోని రజకనగర్‌లో తన పొలంలోకి నీరు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓ వ్యక్తి నడిమి వంకకు అడ్డంగా మట్టి వేశారు. దీంతో నీరు ముందుకు వేగంగా వెళ్లలేక పలు కాలనీల్లోకి వచ్చింది. వంకకు అడ్డంగా వేసిన మట్టిని తొలగించే ప్రక్రియ సాయంత్రం 5.30 గంటలకు పూర్తి చేయడంతో నీరు సాఫీగా వెళ్లింది.


వణికిన రజకనగర్‌


రజకనగర్‌ను వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు వణికిపోయారు. రజకనగర్‌లో కాలువకు సమాంతరంగా కట్టిన గోడను దాటి ఇళ్ల ముందుకు ప్రవాహం ఉప్పొంగింది. కాలువలోని మురుగుతో కలిసి వరద నీరు ఇళ్లలోకి చేయడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. హంద్రీనీవా నుంచి నీటి పంపింగ్‌ నిలిపివేయాలని సంబంధింత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అక్రమ భవనాల తొలగింపు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని