logo

అనంత ప్రగతిలో ముందంజ

అక్షర క్రమంలో ముందుండే అనంతపురం జిల్లా అభివృద్ధిలోనూ ముందంజలో ఉందని, ఇందుకు జిల్లా యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోందని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

Updated : 27 Jan 2023 05:12 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ నాగలక్ష్మి

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అక్షర క్రమంలో ముందుండే అనంతపురం జిల్లా అభివృద్ధిలోనూ ముందంజలో ఉందని, ఇందుకు జిల్లా యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోందని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో 74వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, శిక్షణా కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిశీలన వాహనంలో కలెక్టర్‌, ఎస్పీ, పరేడ్‌ కమాండర్‌ రమేష్‌నాయక్‌తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు, సివిల్‌ పోలీస్‌, హోంగార్డులు, గైడ్స్‌ అండ్‌ స్కౌట్స్‌ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధశాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శకటాలను ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ప్రదర్శించారు. పోలీసు శాఖ, దిశ పోలీసుస్టేషను సంయుక్తంగా నిర్వహించిన మహిళా పోలీసుల ద్విచక్ర వాహన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణాభివృద్ధి శకటం ప్రథమ బహుమతి గెలుపొందగా, గృహనిర్మాణశాఖ, అహుడా శకటాలు ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి.
* ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నదాతకు అండగా నిలవడానికి వైయస్సార్‌ రైతు భరోసా.. పీఎం కిసాన్‌ కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 అందిస్తోందన్నారు. ఈ ఏడాది 2లక్షల 83 వేల కుటుంబాలకు రూ.320.41 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేశామన్నారు. వివిధ పథకాల ప్రగతిని వివరించారు.

పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తున్న

కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ కేతన్‌గార్గ్‌, ఎస్పీ ఫక్కీరప్ప

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీపీవోలో నిర్వహిస్తున్న ‘రక్షక్‌’ ప్రీ ప్రైమరీ పాఠశాల చిన్నారులు ‘దేశం మనదే.. తేజం మనదే’ అనే దేశభక్తి గీతానికి చక్కగా అభినయించారు. అలాగే కేఎస్సార్‌ ఉన్నత పాఠశాల, కురుగుంట, కూడేరు, బుక్కరాయసముద్రం కస్తూరిబా విద్యాలయాల విద్యార్థినులు దేశభక్తిని చాటేలా నృత్యం చేశారు. నగరంలోని కేఎస్‌ఎన్‌ విద్యార్థులు చేసిన కర్రసాము, కుస్తీ పోటీలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహితి, అహుడా ఛైర్‌పర్సన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ హరిత, ఆర్టీసీ రీజనల్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కస్తూర్బ విద్యార్థినుల నృతప్రదర్శన

జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నజిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

జిల్లా పోలీసు కార్యాలయంలో జెండాకు వందనం చేస్తున్న డీఐజీ రవిప్రకాష్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని