logo

అంగన్‌వాడీలతో పెట్టుకుంటే పతనమే..

‘కనీస వేతనం ఇవ్వరు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస వసతులు సమకూర్చరు. కానీ, ముఖ గుర్తింపు హాజరు.. వంటి యాప్‌లను వాడాలని చెబుతారు.

Published : 07 Feb 2023 04:42 IST

ధర్నాలో ప్రసంగిస్తున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘కనీస వేతనం ఇవ్వరు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస వసతులు సమకూర్చరు. కానీ, ముఖ గుర్తింపు హాజరు.. వంటి యాప్‌లను వాడాలని చెబుతారు. అదేలా సాధ్యం. అంగన్‌వాడీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదు. నిర్బంధం చేస్తే పతనం తప్పదు’ అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ అనుబంధ ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అనంత కలెక్టరేట్‌ ముందు భారీ ధర్నా చేపట్టారు. ఓబులు మాట్లాడుతూ అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్‌ కుట్ర చేస్తోంది. ఇదే దారిలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోంది. పొరుగున ఉన్న తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలు, సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు, వేతనాలు ఇస్తోంది. ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ముఖ హాజరు పెట్టడం ఉద్యోగులను దొంగల్లా చూడటమేనని ఆరోపించారు. మొదట మీ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు నిత్యం భూకబ్జాలు, ఇసుక, మద్యం దోపిడీ వంటి వాటితో రూ.కోట్లు గడిస్తున్నారు. వారి వాహనాలకు జీపీఎస్‌, వారు ఎక్కడ వెళ్తున్నారో ఫేస్‌ యాప్‌లు పెట్టాలని డిమాండు చేశారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి, కోశాధికారి జమున మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండు చేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు సావిత్రి, వెంకట నారాయణ, రామాంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, బాల రంగయ్య, ఏటీఎం నాగరాజు తదితరులు మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టర్‌ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.

కళ్యాణదుర్గం సమీపంలో సిబ్బందిని బస్సులో నుంచి దింపేసిన పోలీసులు

ఎక్కడికక్కడ నిర్బంధం

అనంత కలెక్టరేట్‌ ముందు భారీ ఎత్తున చేపట్టిన ధర్నాకు జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి.. వంటి ప్రాంతాల నుంచి బస్సుల్లో, ఇతర రవాణామార్గాల్లో వస్తున్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులు ఆపేసి... మధ్యలోనే దింపేశారు. సోమవారం తెల్లవారు జామున నుంచే ఆ సంఘం నాయకుల ఇళ్ల వద్దకు చేరుకుని గృహ నిర్బంధం చేశారు. ధర్నాకు వెళ్లొద్దంటూ నోటీసులు అందజేశారు. కొంతమంది నాయకులకు ఫోన్‌ చేసి బెదిరించారు. వీటన్నింటిని చేధించుకుని ధర్నాకు తరలిరావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని