logo

వర్సిటీ ప్రగతికి బాటలు పడేనా?

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై వర్సిటీలో చర్చజరుగుతోంది. ఈ నెల 21వ తేదీన ఎస్కేయూ పాలకమండలి సమావేశం జరుగుతున్నందున ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Published : 21 Mar 2023 03:46 IST

సమస్యల్లో విద్యార్థులు, ఉద్యోగులు
నేడు పాలకమండలి సమావేశం

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

ఎస్కేయూ, న్యూస్‌టుడే : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై వర్సిటీలో చర్చజరుగుతోంది. ఈ నెల 21వ తేదీన ఎస్కేయూ పాలకమండలి సమావేశం జరుగుతున్నందున ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో చర్చిస్తారా? లేక అధికారులకు ఉపయోగపడే అంశాలతో సమావేశాన్ని సరిపెడతారా? అనే విమర్శలున్నాయి. కొన్ని అంశాలతో అజెండా రూపొందించారు. మరికొన్ని అంశాలు టేబుల్‌ అజెండాలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. యూజీసీ నిబంధనల ప్రకారం పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పారదర్శకత పాటించాలి. తీర్మాణాలు ఆన్‌లైన్‌లో ఉంచాలి. అయితే రెండేళ్లుగా పాలకమండలి సమావేశ నిర్ణయాలు రహస్యంగా ఉంచుతున్నారు. దీనిపై పాలకమండలి సభ్యులు కూడా మాట దాటవేస్తున్నారు. వర్సిటీ ప్రతిష్ట అధికారుల తీరుతో మసకబారుతోంది.

కష్టంగా పరీక్షల నిర్వహణ

వర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ప్రధాన సమస్యగా మారింది. డిగ్రీ కోర్సు మూడు సంవత్సరాలు, డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్‌ అయితే కోర్సు కాలం పూర్తయిన తరువాత మూడేళ్లలో ఉత్తీర్ణులు కావాలి. కాలేకపోతే వర్సిటీ నిబంధల ప్రకారం ఆ విద్యార్థులు డిగ్రీ వదిలేసుకోవాల్సిందే. మరో సమస్య ఏంటంటే డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫెయిల్‌ అయితే వెంటనే సప్లిమెంటరీ రాసుకొనే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం నూతన విద్యార్థులతో పాటు మొదటి సెమిస్టర్‌ రాసుకోవాల్సిందే. అదేవిధంగా యూజీ, పీజీలో ఒక సబ్జెక్టు ఫెయిల్‌ అయితే ఇన్‌స్టంట్‌ రాసుకొనే విధానాన్నీ తొలగించారు. ఎస్కేయూలో పరీక్షల నిబంధనలపై ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

సస్పెన్షన్ల రద్దుపై ఎదురుచూపు

బోధనేతర ఉద్యోగులు 24 మందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వారిలో ఎక్కువ శాతం బడుగు వర్గాల వారున్నారు. అందులో తప్పు చేసింది ఒకరైతే, మరొకరిని సస్పెండ్‌ చేశారు. వేతనాలు రాకపోవడం, మానసికంగా కుంగి అనారోగ్యం పాలయ్యారు. కొందరు కుటుంబసభ్యులను కూడా కోల్పోయారు. అసలైన వారిని వదిలేసి, ఇతరులపై వేటుపడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

పలు విభాగాల్లో సీట్లు..

విశ్వవిద్యాలయం 33 విభాగాలు ఉన్నాయి. కొన్ని విభాగాల్లో విద్యార్థులు చేరడం లేదు. చరిత్ర, గ్రామీణాభివృద్ధి, సామాజిక కృషి, సామాజికశాస్త్రం విభాగాలు కలిపి కేవలం 21 మంది మాత్రమే చేరారు. వ్యాయామశాస్త్ర విభాగంలో 30 సీట్లు ఉండగా నలుగురు మాత్రమే ప్రవేశాలు పొందారు. ఇలా అనేక విభాగాల్లో 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. విశ్వవిద్యాలయంలో ఆచార్యులు లేకపోవడం, సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థుల ప్రవేశాలు అతితక్కువగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణం చూపుతూ వసతి గృహాలు మూసివేస్తున్నారు. వర్సిటీ ప్రతిష్ట పెరగాలంటే మంచి కోర్సులు, ఉత్తమ అధ్యాపకులు, ఆచార్యులు ఉండాలి. మెరుగైన వసతులు ఉండాలి.  


అడ్డగోలు నిర్ణయాలేనా..?

అడ్డగోలు నిర్ణయాలు తీసుకొనేందుకు పాలకమండలి సమావేశం నిర్వహిస్తున్నారని వర్సిటీలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన ఓ డిప్యూటీ రిజిస్ట్రార్‌ను తిరిగి విధుల్లో నియమించారు. ఈ నియామకం జరిగి సుమారు 6 నెలలైంది. మరో రెండు సంవత్సరాల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అంశాన్ని అజెండాలో చేర్చినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, అడ్డగోలుగా నియామకాలు పొందినవారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు సమాచారం. పాలకమండలి సమావేశంలో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలకు పరిష్కారం, విశ్వవిద్యాలయం అభివృద్ధికి తీర్మానాలు చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని