logo

పంచాయతీలపై జగన్‌ పగ

 ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు, ఇతర పన్నుల ఆదాయంతో పంచాయతీలు కళకళలాడేవి. సర్పంచులు స్వతంత్రంగా ఆలోచించి నిధుల్ని అభివృద్ధి పనులకు వ్యయం చేసేవారు.

Updated : 17 Apr 2024 08:14 IST

 ఉత్సవ విగ్రహాలుగా సర్పంచులు

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం

 ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు, ఇతర పన్నుల ఆదాయంతో పంచాయతీలు కళకళలాడేవి. సర్పంచులు స్వతంత్రంగా ఆలోచించి నిధుల్ని అభివృద్ధి పనులకు వ్యయం చేసేవారు. పలు సమస్యల్ని ఎక్కడికెక్కడ పరిష్కరించేవారు. ప్రజలు నేరుగా సర్పంచిని కలిసి సమస్యను చెప్పుకొనేవారు. జగన్‌ ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు.పేరుకే సర్పంచి పదవి.. ఆర్థిక సంఘం నిధుల్ని పూర్తిగా దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేశారు. స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తూ ఐదేళ్లలో జగన్‌ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సీఎం దెబ్బకు గ్రామాల్లో ప్రగతి అనేది మచ్చుకైనా కనిపించడం లేదు.

 

  • 1044 - ఉమ్మడి జిల్లాలోని ఉమ్మడి పంచాయతీలు
  • 1040 - ఎన్నికలు జరిగిన పంచాయతీలు
  • 2020 నుంచి 2024 వరకు ఆర్థిక సంఘం నిధులు సుమారు - రూ.379 కోట్లు
  • విద్యుత్తు బిల్లులకు జమ చేసుకున్నది - రూ.125 కోట్లు

 ఈనాడు డిజిటల్‌, అనంతపురం: పల్లెసీమల అభివృద్ధికి రూపాయి ఇవ్వని జగన్‌ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చిన నిధులనూ దారి మళ్లించింది. పంచాయతీల ఖాతాల్లో కేంద్రం నిధులు జమైన వెంటనే లాగేసుకున్నారు. నిధులు వస్తాయనే నమ్మకంతో సొంత డబ్బులతో పనులు చేసిన సర్పంచులు అప్పుల్లో కూరుకుపోయారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ గొప్పలు చెప్పే సీఎం జగన్‌.. గ్రామ పంచాయతీల అధికారాలను తొక్కిపెట్టారు. గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా జగన్‌ అని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. నిధులలేమితో కనీసం పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా చేయించలేని దుస్థితికి పంచాయతీలు దిగజారాయి. ఒకప్పటి పంచాయతీ వ్యవస్థను ఊహించుకుని రాజకీయాల్లోకి వచ్చిన యువత ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. గ్రామానికి ఏదో చేద్దామని ఎన్నికల బరిలో నిలిచిన చాలామంది ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. నిధులు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించారంటూ ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్తు బిల్లుల పేరిట స్వాహా

ఉమ్మడి అనంత జిల్లాలో 2021, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి ఉమ్మడి జిల్లాకు మొదటి, రెండో విడతలో రూ.125 కోట్లు విడుదలయ్యాయి. 2021, అక్టోబరులో నిధులు పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడదామని భావించిన సర్పంచులకు వైకాపా ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఖాతాల్లోని నిధులను విద్యుత్త బిల్లులకు జమచేసుకుంది. అప్పటినుంచి ఆర్థిక సంఘం నిధుల్ని ఏదో విధంగా వెనక్కి తీసుకుంటూ వస్తోంది జగన్‌ సర్కారు. ఈనేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలు తెరిపించింది. అయినా వైకాపా ప్రభుత్వం నిధుల్ని లాగేసుకుంటోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. 2022లో ఉమ్మడి జిల్లాకు రూ.48 కోట్లు రాగా.. అందులో నుంచి రూ.29 కోట్లు విద్యుతు బిల్లులకు రూ.7 కోట్లు వీధిదీపాల బిల్లులకు జమ చేసుకున్నారు. 2023-24లో సుమారు రూ.60 కోట్ల వరకు కోత విధించినట్లు సర్పంచులు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ వ్యవస్థ సర్వనాశనం

తాడిమర్రి: కేంద్రం నుంచి వచ్చే నిధులను సొంత పథకాలకు వాడుకుని గ్రామాలను భ్రష్టుపట్టించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. సొంత పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించలేని దౌర్భాగ్యస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి పూర్తిగా విస్మరించారు. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా సర్పంచులు దిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి నిధుల దుర్వినియోగంపై రాష్ట్రపతి, ఇతర కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేయడం చరిత్రలో లేదు. జగన్మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని విధాలా పూర్తిగా నష్టపోతుంది.
- గోనుగుంట్ల భూషణ్‌, ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు



మౌలిక వసతులు కల్పిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తామంటూ ఓట్లు వేయించుకుని గెలిచాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. ఐదేళ్లుగా పంచాయతీలో ఓ వీధిదీపం వేయించాలన్నా, బోరుకు మరమ్మతు చేయించాలన్నా.. నిధులు లేవు. చిన్నపాటి సమస్యనూ పరిష్కరించలేకపోతున్నాం. అప్పు చేసి కొన్ని పనులు చేయించాం. జనాలకు మా ముఖాలను చూపెట్టలేకపోతున్నాం. గ్రామంలోకి వెళితే ప్రజలు నిలదీస్తున్నారు. మా గోడు ఆలకించేదెవరు..  
  -పలు వేదికలు, సమావేశాల్లో అధికార వైకాపా సర్పంచుల ఆవేదన


రూ.10 లక్షలు ఖర్చు చేసినా.. రూపాయీ ఇవ్వలే..

రాయదుర్గం పట్టణం: డి.హీరేహాళ్‌ మండలం పులకుర్తి గ్రామంలో 2022 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోకి నీరు చేరాయి. దాదాపు నలభై ఇళ్లలోకి కాలనీలోకి భారీగా వరదనీరు చేరడంతో గ్రామస్థులంతా భయపడిపోయారు. గ్రామ సర్పంచి దొణప్ప స్పందించి వరదలకు కారణమైన వంకకు సొంత ఖర్చుతో ఆధునికీకరణ చేయించారు. వంకను 60 మీటర్ల వెడల్పు, 200 అడుగుల పొడవుతో పొక్లెయిన్‌తో విస్తరించారు. గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి అధ్వానంగా ఉండటంతో మరమ్మతులు చేయించారు. సుమారు రూ.10 లక్షలకు పైగా సొంత నిధులు ఖర్చు చేసినా నేటీకీ బిల్లులు చెల్లించలేదు. అప్పులు చేసి గ్రామస్థుల సమస్యలు తీర్చానని, బిల్లులు పెట్టాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని సర్పంచి వాపోతున్నారు.

నిధుల్లేక నిస్సహాయ స్థితి

పెద్దవడుగూరు: మండలంలోని 25 పంచాయతీల్లో సర్పంచులు నిధుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వీధిలైట్లు, తాగునీరు, డ్రైనేజీ పనులు చేయాలన్నా నిధుల్లేక నిస్సహాయస్థితిలో ఉన్నారు. పెద్దవడుగూరు పంచాయతీలో తాగునీరు, పైపులైను, మోటారు మరమ్మతులు, డ్రైనేజీ, వీధిలైట్ల నిమిత్తం సుమారు రూ.పది లక్షల సొంత నిధులు ఖర్చుకాగా వాటిలో రూ.5 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. కొన్ని పంచాయతీల్లో నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు చేయడమే మరిచిపోయారు. వీరన్నపల్లి, మేడిమాకులపల్లి ప్రజాప్రతినిధులు వీరన్న, రామాంజనేయులు తదితరులు గ్రామాల్లో సొంత నిధులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని